AP Assembly: ఈ నెల 8 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు - బుధవారం సభ ముందుకు బడ్జెట్
ANdhrapradesh Assembly Session: ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. అటు, టీడీపీ సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.
BAC Meeting on AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 7న (బుధవారం) బడ్జెట్ ప్రవేశపెట్టి.. చివరి రోజు బడ్జెట్ పై చర్చ, పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్నారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపనున్నారు. అటు, గవర్నర్ తో ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పించిందని ఆరోపిస్తూ.. టీడీపీ సభ్యులు బీఏసీ సమావేశాన్ని బహిష్కరించారు. అంతకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
ఏపీ అసెంబ్లీ (AP Assembly) బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పని చేస్తోందని అన్నారు. 'బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాలు లబ్ధి పొందాయి. పేదరిక 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. విద్యా రంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశాం. మన బడి, నాడు - నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తెచ్చాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇందు కోసం రూ.4,417 కోట్లు ఖర్చు చేశాం. అమ్మఒడి ద్వారా 83 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. జగనన్న విద్యా కానుక కోసం ఇప్పటివరకూ రూ.3,367 కోట్లు ఖర్చు చేశాం. డిజిటల్ లెర్నింగ్ లో భాగంగా 8, 9 తరగతుల విద్యార్థులకు 9,52925 ట్యాబ్స్ పంపిణీ చేశాం. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ విధానం ప్రవేశపెడతాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా బోధన ఉంటుంది.' అని గవర్నర్ తెలిపారు. వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రశంసించారు. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానంలో ఉందని.. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిందని చెప్పారు. విజయవాడలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందని.. ఇది అభినందనీయమని గవర్నర్ అన్నారు. 18.8 ఎకరాల్లో 206 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.404.35 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీని ఏర్పాటుపై సీఎం జగన్, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని అన్నారు.
టీడీపీ వాకౌట్
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రీయింబర్స్ మెంట్ ఇచ్చామని గవర్నర్ తెలపగా.. అంతా అబద్ధం అంటూ నినాదాలు చేశారు. 'మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ' అని, రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, అంగన్వాడీలకు అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీని బహిష్కరించిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.