APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Andhra News: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల రాయితీ టికెట్ల జారీకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్ లేదా ఏదైనా ఐడీ కార్డు చూపించి రాయితీ పొందొచ్చని తెలిపింది.
APSRTC Guidelines To Concession For Senior Citizens: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించాల్సిన నిబంధనలకు సంబంధించి సిబ్బందికి ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి రాయితీ పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, 60 ఏళ్లు నిండిన వృద్ధులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 25 శాతం రాయితీని ఆర్టీసీ ఎప్పటి నుంచో కల్పిస్తోంది. అయితే, టికెట్లు జారీ చేసే సమయంలో వయస్సు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బంది, వృద్ధులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే సిబ్బంది టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఏ ఇతర కార్డులను కూడా అంగీకరించడం లేదు. ఒరిజినల్ లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని తెలిపినా.. అవగాహన లేమితో టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు.
- ఇకపై 60 సంవత్సరాల వయసు పై బడిన భారతదేశంలో ఏ రాష్ట్రం వారికైనా అన్ని APSRTC బస్సులలో 25% రాయితీ పొందవచ్చును.
— APSRTC (@apsrtc) November 15, 2024
- వయసు ధృవీకరణ కొరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, గుర్తింపు కార్డు లలో ఏదో ఒక కార్డును టికెట్ తీసుకునే సమయంలో చూపించవలెను pic.twitter.com/e9X1zGE7mx
వృద్ధుల ఫిర్యాదుతో..
దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్ధులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో వృద్ధులకు టికెట్ల జారీకి సంబంధించి నిబంధనలను తెలియజేస్తూ సిబ్బందికి మరోసారి ఆదేశాలిచ్చారు. ప్రయాణ సమయంలో వృద్ధుల వద్ద ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే.. ఫోన్‌లో డిజిటల్ గుర్తింపు కార్డులు చూపించినా రాయితీ టికెట్ జారీ చేయాలని సిబ్బందిని ఆర్టీసీ ఆదేశించింది. ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ అన్నీ బస్సుల్లోనూ వృద్ధులకు రాయితీ టికెట్లు ఇవ్వాలని సిబ్బందికి యాజమాన్యం స్పష్టం చేసింది.
Also Read: Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు