Ashok Gajapati Raju: రామతీర్థం ఘటన అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు... ప్రభుత్వం కక్ష గట్టి కేసు పెడుతోందని అశోక్ గజపతి ఆరోపణ
రామతీర్థంలో బుధావరం జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు అయింది. ఈవో ప్రసాద్ ఫిర్యాదుతో నెలిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు అయింది. బుధవారం రామతీర్థం ఆలయ శంకుస్థాపన సమయంలో జరిగిన ఘటన ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదుతో నెలిమర్ల పోలీస్ స్టేషన్‌లో అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ శంకుస్థాపనను అడ్డుకుని, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కక్ష గట్టి కేసులు
ఈ కేసు విషయంపై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాలరాస్తోందని ఆరోపించారు. బుధవారం నెల్లిమర్ల మండలం రామతీర్థం వద్ద రామాలయం పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇష్టం వచ్చినట్లు చేశారని విమర్శించారు. బోడికొండపై కోదండరాముడి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా నిన్న ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లిమర్ల పోలీసులు అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు. దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాలని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కక్ష గట్టి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ట్రస్ట్‌ల ఆచారాలు, సంప్రదాయాలు పాటించాలన్నారు. రామతీర్థం శంకుస్థాపన కార్యక్రమంలో సంప్రదాయం పాటించకపోవడం బాధ కలిగించిందన్నారు. ఆలయానికి వాడుతున్న రూ.3 కోట్ల నిధులు ప్రభుత్వ ధనం కాదన్నారు. పూజా కార్యక్రమాలకు అడ్డు తగిలితే చర్యలు తీసుకోవచ్చన్నారు. ఆలయాల నిధులను ప్రభుత్వం ఇతర పనులకు వాడుతోందని ఆరోపించారు.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
మంత్రి బొత్స ఘాటు వ్యాఖ్యలు
అశోక్ గజపతిరాజుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అశోక్ గజపతి పెద్దమనిషి అనుకున్నాం. ఆయన పెద్దరికాన్ని ఆఖరి రోజుల్లో తగ్గించుకున్నారు. ఆయనలో ఎవరు ప్రవేశించి నిన్న ఆ విధంగా వ్యవహరించారో తెలియదు. పొలిటికల్ స్ట్రాటజీతోనే ఇవ్వన్నీ చేస్తున్నారు. మీడియా కెమెరాల సాక్షిగా ఆయన చేసింది కరెక్ట్ అని తేలితే నేను తలదించుకుంటా. తప్పులు ఆయన చేసి నిందలు మా పై వేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది. ధర్మకర్తగా ఆలయ అభివృద్ధికి ఆయన ఎప్పుడైనా సహకరించారా? విగ్రహాల కోసం లక్ష ఇచ్చి దానికి కూడా కండిషన్ పెట్టారు. టీటీడీ విగ్రహాలు ఉచితంగా ఇచ్చింది కాబట్టే వెనక్కి పంపామన్నారు.' అని బొత్స అన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి