(Source: ECI/ABP News/ABP Majha)
AP Ration DBT Scheme : కార్డుదారుల్ని నగదు బదిలీ పథకానికి మార్చాలని ఒత్తిళ్లు, డిప్యూటీ తహసీల్దార్ వాయిస్ మెసేజ్ వైరల్!
AP Ration DBT Scheme : ఏపీలో రేషన్ బదులు నగదు బదిలీ పథకం వార్తల్లో నిలుస్తోంది. కార్డులకు ఆప్షనల్ ఇస్తామని చెబుతున్న ఈ పథకాన్ని కచ్చితంగా అమలుచేయాలని కొందరు అధికారుల చేస్తున్న మౌఖిక ఆదేశాలే ఇందుకు కారణం అవుతున్నాయి.
AP Ration DBT Scheme : ఏపీలో రేషన్ బదులు నగదు బదిలీ పథకం వివాదాస్పదం అవుతోంది. టార్గెట్ ప్రకారం రేషన్ కార్డుదారులను నగదు బదిలీ పథకంలోకి చేరాలని బలవంతం పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలలు నగదు తీసుకోవాలని ఒత్తిళ్లు కూడా వస్తున్నట్లు సమాచారం. నర్సాపురం డిప్యూటీ తహసీల్దార్ వాయిస్ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి నరసాపురం డిప్యూటీ తహసీల్దార్ సుగుణ రాణి వాయిస్ మెసేజ్ లో నరసాపురం టౌన్ లో ఉన్నటువంటి కార్డుదారులు అందరినీ నగదు బదిలీ పథకంలో చేర్చాలని వీఆర్వోలను ఆదేశించారు. మూడు నెలల పాటు కార్డుదారులందరినీ ఏదోలా నగదు బదిలీ పథకంలోకి మార్చాలన్నారు. అవసరమైతే మూడు నెలల తర్వాత మళ్లీ నగదు కాకుండా బియ్యం తీసుకునేలా అవకాశం ఉంటుందని చెప్పాలని తెలిపిన డిప్యూటీ తహసీల్దార్ వాయిస్ మెసేజ్ లో తెలిపారు. వీఆర్వోలు అందరికీ వాయిస్ మెసేజ్ ద్వారా సూచనలు డిప్యూటీ తహసీల్దార్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ వాయిస్ మెసేజ్ వైరల్ కావడంతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. అందుకనే అధికారుల ద్వారా కార్డుదారులకు బియ్యం తీసుకోకుండా బలవంతంగా నగదు బదిలీ పథకంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వాయిస్ మెసేజ్ వైరల్
"టౌన్ వీఆర్వోలకు ముఖ్య గమనిక అండి. మన మండలంలో నగదు బదిలీ పథకం(డీబీటీ)లో రెండు కార్డులే చేశామని జేసీ గారు, పై అధికారులు మీటింగ్ పెట్టి సీరియస్ అయ్యారు. ఇప్పటి నుంచి వీఆర్వోలు చేయాల్సింది ఏమిటంటే టౌన్ లో ప్రతి ఒక్కరూ మూడు నెలల పాటు ఈ స్కీమ్ కిందకు రావాల్సిందే. మూడు నెలల తర్వాత బియ్యానికి మార్చుకోవచ్చని చెప్పండి. కానీ ఈ మూడు నెలలు మాత్రం నగదు బదిలీ పథకానికి మార్చుకోవాలి. మీకు షాపు వైజ్ లిస్ట్ లు ఇచ్చాం. వీఆర్వోల వాళ్లందరితో మాట్లాడి నగదు బదిలీ పథకానికి మార్చండి. మూడు నెలల తర్వాత వారిని రైస్ లోకి మార్చుకోవచ్చు. ఇబ్బంది లేదని చెప్పండి. కిలో బియ్యానికి రూ.16 ఇస్తారు. ఐదు కిలలోకు రూ. 90 చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని తొంభైలు మీకు అకౌంట్లో పడతాయని చెప్పాలి. టౌన్ వీఆర్వోలు వాలంటీర్ల సాయంతో ఇది పూర్తి చేయండి. కచ్చితంగా 500-600 కార్డులు డీబీటీలోకి మార్చండి. ఇప్పటి వరకూ ఆప్షనల్ గా ఇచ్చేవారు. ఇప్పుడు ఆప్షన్ లేదు ప్రతి ఒక్కరు కచ్చితంగా చేయాల్సిందే అని చెప్పండి. ప్రతీ వాలంటీర్ 25 కార్డులు డీబీటీ చేయండి. " డిప్యూటీ తహసీల్దార్ వాయిస్ గా చెబుతున్న మెసేజ్ లో ఇలా ఉంది.
అది అపోహ మాత్రమే
ఈ ఘటనపై నర్సాపురం తహసీల్దార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రేషన్ బదులుగా నగదు బదిలీ పథకాన్ని ప్రకటించారన్నారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు 5 మండలాలను ఎంపిక చేస్తే పశ్చిమగోదావరి జిల్లా నుంచి నర్సాపురాన్ని ఎంపిక చేశారని చెప్పారు. "నాన్ ఎఫ్ఏసీ కార్డుదారులను వాలంటీర్ల ద్వారా అప్రోచ్ అయి వారికి ఇష్టమైతే నగదు బదిలీ పథకంలోనికి మారుస్తాం. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. కార్డుదారుల్లో అపోహలు ఏమిటంటే నగదు బదిలీ వల్ల కార్డులు తొలగిస్తారని అనుకుంటున్నారు. అలా ఎట్టిపరిస్థితుల్లో జరగదు. తిరిగి బియ్యం కావాలంటే అందులోకి మార్చుకోవచ్చు." తహసీల్దార్ తెలిపారు.