AP PRS Issue: చర్చలకు రండి... లిఖిత పూర్వకంగా ఆహ్వానించిన ప్రభుత్వం... ఉద్యోగులు వెళ్తారా...!
కొత్త పీఆర్సీపై రేపు ప్రభుత్వం, పీఆర్సీ స్టీరింగ్ కమిటీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది.
ప్రభుత్వం లిఖిత పూర్వకంగా పిలిస్తే చర్చలు గురించి ఆలోచిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించిన గంట వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులను చర్చలు రావాలని ప్రభుత్వం కోరింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ చర్చల ఆఫర్ పై ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాయి. రేపు ఉదయం గం.9.30లకు సెక్రటేరియట్ అసోసియేషన్ హాల్ లో స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని స్టీరింగ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వంతో చర్చలపై నిర్ణయించనున్నట్లు సమాచారం.
మంత్రుల కమిటీతో చర్చలకు ఆహ్వానం
కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రుల కమిటీతో చర్చలకు జరపాలని కోరింది. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులకు సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోకపోతే సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీతో చర్చించేందుకు కమిటీ సభ్యులు ముందుకు రాలేదు. దీంతో కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంగళవారం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేసేందుకు సమయాత్తమవుతోంది.
ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించినట్లుగానే ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ ఉద్యోగులకు చార్జి మెమోలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు మాత్రమే చేస్తున్నారు. ఇంకా సమ్మెలోకి వెళ్లలేదు. విధుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగానే చేయాలని ట్రెజరీ అధికారులు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులను ఆదేశించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ఉన్నత అధికారులు పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. సర్క్యూలర్లు ఇచ్చారు. అయితే అలా ప్రాసెస్ చేయవద్దని ఉద్యోగ సంఘాలు ట్రెజరీ అధికారులను కోరారు. దీంతో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయబోమని ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేశారు. కలెక్టర్ల ఒత్తిడి మేరకు పోలీసులు, జడ్జిలు, మున్సిపల్ సిబ్బందికి సంబంధించిన జీతాలు మాత్రం ప్రాసెస్ చేశారు. తాము ఎంత చెప్పినా.. ఎన్ని సార్లు సర్క్యూలర్లు జారీ చేసినా జీతాల బిల్లులను ప్రాసెస్ చేయకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు , మూడు రోజుల నుంచి విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఈ క్రమంలో అధికారులకు చార్జీ మెమోలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 27 మంది డిడి, ఎస్టీఓ, ఏటిఓ లకు మెమోలు జారీచేసారు. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: గవర్నర్‌పై దీదీ ఫైర్.. ఏకంగా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసిన సీఎం!