Andhra News: ఉచిత ఇసుక విధానంలో మార్పులు - ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Sand Policy: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై స్థానిక అవసరాలకు ట్రాక్టర్లలోనూ ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
AP Government Changes In Sand Policy: ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి స్థానిక అవసరాలకు రీచ్‌ల నుంచి ఇసుకను ఉచితంగా ట్రాక్టర్లలోనూ తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సొంత అవసరాలకు ఎడ్లబండ్ల ద్వారానే ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఉండేది. తాజాగా దాన్ని సవరిస్తూ ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్లలోనూ తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఉచిత ఇసుకపై సమీక్షించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక అవసరాల నిమిత్తమే ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని స్పష్టం చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇసుక కొరత రావొద్దన్న ఉద్దేశంతో.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పనులకు ఆటంకం లేకుండా.. వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని.. అవసరమైన వారు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని వెల్లడించారు.
ఇటీవల పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ సర్కారు జీవో జారీ చేసింది. పట్టా భూములతో పాటు, డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేస్తూ కొద్ది రోజుల క్రితమే సర్కారు ఆదేశాలు ఇచ్చింది. అటు, కొత్తగా 108 ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలి విడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక సైతం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో జిల్లా కమిటీలు నిర్ణయించిన ధరకు పట్టా భూముల్లోనూ ఇసుక పొందవచ్చు. వీటితో పాటే నదీ తీర ప్రాంతాల్లోనూ ఇసుక రీచ్‌లు ఉంటే అధికారులు గుర్తింపు ఇవ్వనున్నారు.
Also Read: YS Sharmila Bus : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల