AP Free Bus Guidelines: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
Free Bus Scheme for Women Guidelines | ఏపీలో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు మార్గదర్శకాలు విడుదల చేశారు.

Free Bus Scheme In Andhra Pradesh | అమరావతి: రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్ట్ 15 నుండి ‘స్త్రీ శక్తి’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు వర్తించనుంది. ప్రయాణానికి ముందు సరైన గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
పల్లె వెలుగు
ఆల్ట్రా పల్లె వెలుగు
సిటీ ఆర్డినరీ
మెట్రో ఎక్స్‌ప్రెస్
ఎక్స్‌ప్రెస్ బస్సులు
ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం వర్తించదు:
తిరుమల-తిరుపతి మధ్య నడిచే సప్తగిరి బస్సులు
నాన్‌స్టాప్ సర్వీసులు
ఇతర రాష్ట్రాల మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సులు
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులు
ఉచిత బస్సుతో భద్రా చర్యలు తీసుకున్న ప్రభుత్వం
బస్సుల్లో రద్దీ పెరగడం వల్ల అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకుంటోంది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే బస్టాండ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేలా ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హెల్ప్‌లైన్, లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా త్వరలో తాజా వివరాలకు https://aptransport.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు
ఆర్టీసీ బస్సుల్లో ఏం సౌకర్యాలు కావాలి: మంత్రి నాదెండ్ల
— apcsmin (@apcsmin) August 10, 2025
స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలి బస్టాండ్ సందర్శించిన ఆయన మహిళ ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. #freebus pic.twitter.com/kaIq7TjWxg
మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా..
ఏపీ ప్రభుత్వం మహిళల ప్రయాణ ఖర్చు తగ్గించడానికి ఎన్నికల హామీని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపగా.. తాజాగా అందుకుగానూ మార్గదర్శకాలు సైతం జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గించడమే కాక, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆర్టీసీ విధానాలను పరిశీలించిన తరువాతే కూటమి సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది.























