Viveka Murder Case: వివేకా హత్య కేసును సీబీఐ మళ్లీ దర్యాప్తు చేయాలి: ప్రజాప్రతినిధులకు సునీత లేఖ
YS Sunitha Letter over Viveka Murder Case | తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ రీఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టేలా చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వైఎస్ సునీత లేఖ రాశారు.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో న్యాయం జరిగేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)పై మళ్లీ ఒత్తిడి తెచ్చేలా చూడాలని ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరారు. తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, ఆమె దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఓ బహిరంగ లేఖ రాశారు. వివేకా చనిపోయారన్న విషయం ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం ముందే వైఎస్ జగన్‌కు తెలిసిందని దర్యాప్తులో తేలిందన్నారు.
కుట్రదారులను గుర్తించకుండా దర్యాప్తు ముగించారు
ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి తన తండ్రి వివేకాను హత్య చేసిన వారితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు కాల్ డేటా రికార్డుల ఆధారంగా సీబీఐ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో తెలిపిందని సునీత గుర్తుచేశారు. అయినా, ఆ కోణంలో విచారణ చేయకుండానే సీబీఐ తాత్కాలికంగా దర్యాప్తును ముగించిందని ఆమె విమర్శించారు. అసలు కుట్రదారులెవరో గుర్తించకుండానే దర్యాప్తు ముగిసినట్టు ప్రకటించడం బాధారం అన్నారు. "ఒక సోదరిగా నేను న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి" అని రాఖీ పౌర్ణమి సందర్భంగా సునీతా రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు.
ఆరేళ్లు అయినా న్యాయం జరగలేదు..
"నా తండ్రి వివేకానందరెడ్డి హత్యకేసులో న్యాయం కోసం గత ఆరు సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్నాను. నా తండ్రి సాయం, మా కుటుంబ మద్దతుతో ఏర్పడిన పార్టీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే నన్ను వేధించింది. ప్రజాస్వాయ్యం ఖూనీ జరుగుతోంది. మాజీ ప్రజాప్రతినిధి, మా సీఎం సోదరుడు హత్య కేసులో ఇప్పటికీ న్యాయం దక్కలేదు. హత్య చేసిన నిందితులను పట్టుకున్నా, వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నిన వారిని మాత్రం వదిలేశారు. ఈ పోరాటంలో నాకు మీ సహాయం కావాలి"
ఎన్నికల్లో ఆయుధంగా వాడుకున్నారు..
"2019 ఎన్నికల సమయంలో నా తండ్రి వివేకానందరెడ్డి హత్యను వైఎస్సార్ సీపీ ఓ రాజకీయ ఆయుధంగా వాడుకుంది. హంతకులను పట్టుకుంటానని హామీ ఇచ్చిన నా సోదరుడు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసు కీలకమైన దశలో ఉన్న సమయంలో దర్యాప్తు చేస్తున్న సిట్‌ను మార్చేశారు. సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పి, అలా చేస్తే ఎంపీ అవినాష్ పార్టీ మారుతాడని సాకులు చెప్పారు. నాకు న్యాయం జరగదని అప్పుడే అర్థమైంది" అని ప్రజాప్రతినిధులకు రాసిన లేఖలో వైఎస్ సునీత స్పష్టం చేశారు.
గుండెపోటు అన్నారు.. వెళ్లి చూస్తే గాయాలు
నా తండ్రి హత్య జరిగిన రోజు ‘సాక్షి’ ఛానెల్ గుండెపోటుతో చనిపోయారని వార్త ప్రసారం చేసింది. తీరా మేం పులివెందులుకు వెళ్లి చూస్తే ఆయన శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చింది. ఆయనను సరిగ్గా చూపించకుండా బ్యాండేజీలు చుట్టారు. తరువాత అధికారం మారినా న్యాయం జరగలేదు. హత్య కేసుతో సంబంధం ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో పోలీసులు సహకరించలేదు. దాంతో కేసు నీరుగార్చే కుట్ర జరిగింది" అని వైఎస్ సునీత తన లేఖలో ప్రస్తావించారు.






















