Free Bus Service For Ladies In AP : ఆంధ్రప్రదేశ్ మహిళలు ఈ బస్‌లలో ప్రయాణం చేయాలంటే టికెట్ తీసుకోవాల్సిందే!
Free Bus Service For Ladies In AP :ఆగస్టు 15 ప్రారంభం కానున్న ఉచిత బస్ ప్రయాణ పథకంలో ఈ బస్‌లలో ప్రయాణించాలంటే మాత్రం మహిళలు టికెట్ తీసుకోవాలి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Andhra Pradesh Free Bus Service For Ladies: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంలో మరింత క్లారిటీ ఇస్తోంది. ప్రభుత్వం ఏ బస్లలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఏ బస్లలో టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలో స్పష్టత ఇచ్చింది. బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మరిన్ని విషయాలపై చర్చించింది. ఆగస్టు 15వ తేదీని ఈ పథకాన్ని సంబరంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది.
చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేయవచ్చు. ఏ మూల నుంచి ఏ మూలకు అయినా ఉచితంగా వెళ్లిపోవచ్చు. ఈ మేరకు రూపొందించిన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీల్లో ఇది చాలా ముఖ్యమైంది. అలాంటి గేమ్ ఛేంజర్ లాంటి హామీకి కేబినెట్ ఓకే చెప్పింది.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్.టి.ఆర్. భరోసా కింద రూ.34 వేల కోట్లు, తల్లికి వందనం పథకం ద్వారా రూ.10,091 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. రైతుభరోసా, దీపం-2, అన్న క్యాంటీన్లు అమలులో ఉన్నాయి. ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుకు రవాణా, రోడ్లు & భవనాల శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. “స్త్రీ శక్తి” - ఉచిత బస్సు ప్రయాణం హామీని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు మంత్రి రాంప్రసాద్ కేబినెట్లో తెలిపారు.
ఏ బస్లలో ఉచిత ప్రయాణం చేయవచ్చు?
ఆంధ్రప్రదేశ్లో 5.25కోట్ల జనాభా ఉండగా అందులో 2.62 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారందరికీ ఈ పథకం వర్తించబోతోంది. ఈ పథకం కింద మహిళలు, బాలికలు ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు.
ఉచిత ప్రయాణ సమయంలో ఏం కావాలి?
ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు టికెట్ ఇస్తారు. ఇలా ఉచిత టికెట్ ఇవ్వాలంటే బస్లో ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు చూపించాలి. రాష్ట్రానికి చెందిన వ్యక్తులం అనే గుర్తింపు కార్డు చూపిస్తేనే ఉచితంగా ప్రయాణించేందుకు టికెట్ ఇస్తారు. లేకుంటే డబ్బులు తీసుకొని టికెట్ ఇస్తారు. ఆధార్కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాలి. అప్పుడు ఉచిత పథకం అప్లై అవుతుంది.
ఈ బస్లలో ఉచిత ప్రయాణం లేదు
ప్రభుత్వం చెప్పిన బస్లలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారు. మిగతా బస్లలో మహిళలు కూడా టికెట్ తీసుకొని మాత్రమే ట్రావెల్ చేయాలి. నాన్ స్టాప్, అంతర్ రాష్ట్రీయ బస్ సర్వీస్లు, ఇతర కేటగిరీల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతి లేదు. కాంట్రాక్టు క్యారేజ్ సర్వీస్లు, చార్టెడ్ సర్వీస్ల,ప్యాకేజ్ టూర్లకు కూడా వర్తించదు. అంటే మహిళలు అంతా కలిసి బస్‌లో టూర్‌కు వెళ్లేందుకు ఉచితంగా బుక్ చేసుకోవడానికి లేదు. అంతా కలిసి టూర్‌కు వెళ్లాలంటే మాత్రం డబ్బులు ఇచ్చి బుక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74 శాతం బస్సులు అంటే 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవుతుంది. దీని వల్ల నెలకు 162 కోట్లు అనగా ఏడాదికి దాదాపు రూ.1,942 కోట్ల వ్యయం అవుతుంది. దీని వల్ల రోజుకు దాదాపు 26.95 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.
ఈ ఏడాది అదనంగా 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.వచ్చే రెండేళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులో కొనుగోలు చేయబోతున్నారు. వీటితోపాటు డిమాండుకు తగ్గట్టుగా డ్రైవర్లు, మెకానిక్ల నియామకాలు కూడా చేపడతామంటోంది ప్రభుత్వం.
ఇప్పటికే ప్రభుత్వ రవాణా సర్వీస్లను16.11లక్షల మంది వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు అయితే మరో 10.84 లక్షల మంది వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తద్వారా సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారని లెక్కలు వేస్తున్నారు.
ఈ పథకం అమలులో మహిళా కండక్టర్లకు బాడీ కెమెరాలు, బస్సులలో సీసీ కెమెరాలు అమర్చబోతున్నారు. మహిళల, బాలికల భద్రతకు పెద్ద పీట వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. బస్ స్టేషన్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు కూడా వెల్లడించారు.





















