AP DGP Gautam Sawang: గంజాయి ఏపీకి కొత్త కాదు... డ్రగ్స్ వ్యవహరంలో రాజకీయం వద్దు... డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ ఆదేశాల మేరకు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఎన్.ఐ.ఎ. సహకారంతో రాష్ట్రంలో గంజాయిని అరికడతామన్నారు.
AP DGP Gautam Sawang: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాదకద్రవ్యాల నియంత్రణపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. 45 మంది పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ వద్ద గల మంజీరా మాల్ లో మంగళవారం సాయంత్రం వరకూ ఈ సమీక్ష కొనసాగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెలరోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని మరింత పటిష్టంగా కట్టడి చేస్తామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని డీజీపీ అన్నారు. ఎన్ఐఏ సాయంతో గంజాయి రవాణా ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. గత ఏడాది ఏపీలో 2 లక్షాల 90 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గత పదేళ్ల కంటే గత ఏడాదిలోనే అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు.
గంజాయి ఏపీకి కొత్త కాదు
గతంలో ఏపీ గంజాయి కేంద్రంగా ఉందనే ఆరోపణలు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. 2016లో కేంద్ర హోంశాఖ కూడా ఈ విషయాలు చెప్పిందన్నారు. శ్రీలంక నుంచి గంజాయి రవాణాపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. గంజాయి రవాణా అనేది కొత్త అంశం కాదన్న డీజీపీ... గంజాయిని ఎలా అరికట్టాలో చర్చించామన్నారు. గతంలో 3 వేల ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశారని లెక్కలు ఉన్నాయని, ఇప్పుడు నాలుగు వేలకు పైగా ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశామన్నారు. ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్, ఎన్సీబీ కేసులు ఏపీకి సంబంధలేదన్నారు. ఒడిశా, తెలంగాణ పోలీసు అధికారులతో మాట్లాడుతున్నామని డీజీపీ తెలిపారు. రాజకీయంగా అసత్య ఆరోపణలు సరికాదన్నారు. గంజాయి రవాణా ఇతర రాష్ట్రాలకు కూడా చెందిందన్నారు. ఇతర రాష్ట్రాల సహకారంతో చాలా మందిని అరెస్టు చేశామన్నారు. తెలంగాణ, హరియాణా, కర్ణాటక, యూపీకి చెందిన వారు గంజాయి రవాణాలో పట్టుబడుతున్నారని డీజీపీ వ్యాఖ్యానించారు. వారిని పట్టుకునేందుకు ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. గంజాయి రవాణా ఏపీలో కొత్త విషయం కాదన్నారు. అన్ని విషయాలను రాజకీయం చేయొద్దని కోరారు.
Also Read: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం
డ్రగ్స్ తో ఏపీ సంబంధం లేదు
ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల సాయం కూడా తీసుకుని గంజాయి రవాణాను అరికడతామని డీజీపీ అన్నారు. చెక్ పోస్టులు పెట్టినా నిందితులు వేరే మార్గాలలో రవాణా చేస్తున్నారన్నారు. ముంద్రా పోర్టులో డ్రగ్స్ దొరికిన తర్వాత రాజకీయంగా చాలా విమర్శలు చేశారని డీజీపీ అన్నారు. ఆ డ్రగ్స్ తో ఏపీకి అసలు సంబంధం లేదని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు, డీఆర్ఐ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. తాను కూడా డీఆర్ఐ చీఫ్ తో మాట్లాడానని డీజీపీ తెలిపారు. ఎన్ఐఏ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఎన్సీబీ దర్యాప్తులో నర్సాపూర్ అని పేరు వచ్చిందని ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఏపీకి సంబంధం లేదన్నారు. ఇప్పటి వరకూ ఏపీకి సంబంధం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పలేదని డీజీపీ తెలిపారు. పోలీసులపై ఆరోపణలు సరికాదన్నారు. గంజాయి ఏపీకి కొత్తకాదని, గంజాయి సాగు ఏపీ ఒడిశా సరిహద్దుల్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారన్నారు. గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుని అరికడతామని స్పష్టం చేశారు.
Also Read: మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి