CM Jagan: మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం
వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. మేనిఫెస్టోలోని హామీలను వంద శాతం నెరవేరుస్తున్నట్టు చెప్పారు.
రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు. వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవాపథకం.. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు.
సున్నా వడ్డీ పథకం కింద 6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని సీఎం తెలిపారు. 9,160 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఆర్బీకేలో ఉంటారని.. కౌలు రైతులు సహా రైతులందరికి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సేవలు అందిస్తారని చప్పారు. ఆర్బీకేలకు అనుసంధానంగా 10,750 యంత్రసేవా కేంద్రాలు.. పొగాకు కొనుగోళ్లలోనూ జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచామని సీఎం జగన్ అన్నారు. కష్ట కాలంలోనూ.. రైతుల పట్ల బాధ్యతగా ఉన్నామని సీఎం చెప్పారు. ధాన్యం సేకరణ కోసం దాదాపు రూ.36 వేల కోట్లు ఖర్చుచేశామన్నారు.
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెల్లించింది. కరవు సీమలోనూ నేడు పుష్కలంగా నీరు అందుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తెచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నాం.
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
అన్నదాతలకు కనీస మద్దతు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. విద్యుత్ సరఫరా కోసం రూ.1700 కోట్లతో ఫిడర్ల మార్పు చేశామని చెప్పారు. రూ.3 వేల కోట్ల వ్యయంతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. అన్నదాతలకు అండగా ఉండటమే.. తమ ప్రభుత్వం లక్ష్యమని సీఎం చెప్పారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి