Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Andhrapradesh News: ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. పర్యావరణహితంగా మట్టి గణపయ్యలనే పూజించాలని పిలుపునిచ్చారు.
Deputy CM Pawan Kalyan Key Orders On Plastic Usage: ప్లాస్టిక్ పర్యావరణానికి పెను ముప్పుగా మారిన విషయం తెలిసిందే. దీని వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు సైతం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మార్పు మాత్రం రావడం లేదు. కొన్నిసార్లు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా అది కొద్ది రోజులకే పరిమితమవుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారులకు కీలక సూచనలు చేశారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురం (Pithapuram) నుంచే ఇది ఆచరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పూర్తిగా తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్‌తో చేసిన కవర్లతో ఇవ్వొద్దన్నారు. ప్రసాదాల పంపిణీకి తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలని పేర్కొన్నారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లోనే ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్దేశించారు.
'మట్టి గణపతినే పూజించండి'
కొద్దిరోజుల్లో వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజలు మట్టి వినాయకులనే పూజించాలని, వేడుకల్ని పర్యావరణహితంగా జరుపుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాలతోనే పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని పవన్ అధికారులకు సూచించారు. 'మన వేడుకలు, ఉత్సవాల్లో పర్యావరణహిత వస్తువులను వాడడం మేలు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. ప్రజలంతా మట్టి వినాయకులనే పూజించాలి.' అని పవన్ పేర్కొన్నారు. కాగా, సోమవారం ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరామ్ పవన్‌ను కలిశారు.
Also Read: Nara Lokesh: ల్యాప్ టాప్‌లు ఫ్రీగా పంపిణీ చేసిన నారా లోకేశ్, వీరికి మాత్రమే!