AP Seva Portal: దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు... ఏపీ సేవ పోర్టల్ 2.0కు సీఎం జగన్ శ్రీకారం
ఏపీ సేవ పోర్టల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. వివిధ శాఖల సేవలను ఒకే పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు దీనిని ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా అర్జీ ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకోవచ్చన్నారు.
రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన చేరువైందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 'ఏపీ సేవ పోర్టల్'ని తీసుకొచ్చింది. ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే అది ఎప్పుడు, ఏ అధికారి వద్ద ఉందో దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది. ఈ సేవకు సంబంధించిన ‘ఏపీ సేవ పోర్టల్’ని సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లాడుతూ... ఏపీ సేవ పేరుతో సిటిజన్ సర్వీసెస్ పోర్టల్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీ తనం పెంచేందుకు ఈ పోర్టల్ మరింత ఉపయోగపడుతోందన్నారు.
డాక్యుమెంట్ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ఆన్‌లైన్ లోనే దరఖాస్తులు ఆమోదించే అవకాశం ఉంటుంది.
— YSR Congress Party (@YSRCParty) January 27, 2022
- సీఎం వైయస్ జగన్ #YSJaganMarkGovernance
మీ సేవా కేంద్రాల్లో కూడా లేనన్ని సేవలు సచివాలయాల్లో
గ్రామ స్వరాజ్యం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి 2 వేల జనాభాకు ఒక్కొక్కటి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుచేశామన్నారు. వీటి ద్వారా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో నిరంతరం పనిచేస్తున్నామన్నారు. ఈ సేవలను మరింత మెరుగు పరిచేందుకు మరో ముందడుగు వేస్తూ ఈ పోర్టల్ ప్రారంభించామన్నారు. నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామాలనే తేడా లేకుండా ప్రజల తమ ఊరిలోనే అన్ని రకాల ప్రభుత్వ సేవలు పొందేందుకు అవకాశం కల్పించామన్నారు. సుమారు 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందిస్తుందన్నారు. మీ సేవా కేంద్రాలలో కూడా అందుబాటులోని సేవలను సచివాలయాలు అందిస్తున్నాయని సీఎం జగన్ అన్నారు.
Also Read: ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ప్రతిపాదన... అవేంటంటే...!
వివిధ శాఖల సేవలు ఒకే పోర్టల్ పరిధిలో...
ప్రజల అర్జీలను సచివాలయాల సిబ్బంది వివిధ ప్రభుత్వ శాఖల పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. దీంతో ఆ అర్జీ ఏ స్థాయిలో ఉందో ఆ సమాచారం సచివాలయ సిబ్బందికి తెలియడం లేదన్నారు. దీంతో అర్జీదారుడికి సచివాలయ సిబ్బంది సరైన సమాచారం అందించలేకపోతున్నారని సీఎం అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వివిధ శాఖలు ఆన్‌లైన్ ద్వారా అందజేసే సేవలన్నింటిని ఒకే పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. దీంతో సచివాలయ సిబ్బందికి తమ పరిధిలోని అర్జీల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు. సచివాలయాల ద్వారా పొందుతున్న సేవలలో 90 శాతం వరకు కొత్త పోర్టల్‌కు అనుసంధానించామన్నారు. రెవెన్యూ–సీసీఎల్‌ఏ, పట్టణాభివృద్ధి, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖలకు సంబంధించి 135 సేవలను కొత్త పోర్టల్‌కు అనుసంధానించి 20 రోజులు ట్రయల్ రన్ చేశామన్నారు. సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం జగన్ తెలిపారు. మిగిలిన శాఖలను కూడా కొత్త పోర్టల్‌కు అనుసంధానిస్తామని సీఎం జగన్ అన్నారు.