Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Nara Ramamurthy Naidu News | సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏపీ సీఎం చంద్రబాబు తన ఢిల్లీ, మహారాష్ట్ర కార్యక్రమాలు మధ్యలోనే నిలిపివేసి హైదరాబాద్‌కు రానున్నారు.
Chandrababu Brother Ramamurthy Naidu Health Condition | హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, మహారాష్ట్రలో కార్యక్రమాలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఆయన సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో తన కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్మూర్తి నాయుడు కోలుకోవాలని చంద్రబాబు ఫ్యామిలీ, టీడీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే.
చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఏపీకి నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. అనంతరం షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు పాల్గొనాలి. కానీ తమ్ముడు రామ్మోహన్ నాయుడు ఆరోగ్యం విషమించినట్లు కుటుంబం నుంచి సమాచారం అందుకున్న చంద్రబాబు తన పర్యటన మధ్యలోనే నిలిపివేసి ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు 3.30 కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి 4.10 కి AIG హాస్పిటల్ కు చంద్రబాబు చేరుకుంటారని అధికారులు తెలిపారు.
నారా లోకేష్ కార్యక్రమాలు రద్దు
అంతకుముందే చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ కు బయలుదేరారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని లోకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చారు.
1994లో ఎమ్మెల్యేగా ఎన్నిక
నారా కర్జురనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల పెద్ద కుమారుడు ఏపీ సీఎం చంద్రబాబు కాగా, రెండో కుమారుడు రామ్మూర్తి నాయుడు. వీరి స్వస్థలం చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె. అన్న చంద్రబాబు పార్టీ టీడీపీలో చేరిన రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి 1994లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు ఓటమి చెందగా, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రామ్మూర్తి నాయుడుకు సంతానం నారా రోహిత్, నారా గిరీష్. వీరిలో రోహిత్ టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తున్నారు.