Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Chandrababu : ఆంధ్రప్రదేశ్ అప్పులపై నిజాలంటో తేల్చేందుకు జగన్ అసెంబ్లీకి రావాలని చంద్రబాబు సవాల్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేశారని వాదిస్తున్న జగన్ సవాల్ స్వీకరిస్తారా ?
Will Jagan come to the Assembly to find out the truth about Andhra Pradesh debts: ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ? అ అంశంపై రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్ ఏపీ అప్పులు చాలా తక్కువగా ఉన్నాయని బడ్జెట్‌లో చెప్పారని కానీ టీడీపీ పది లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. అయితే చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో అప్పులపై ప్రకటన చేశారు. పది లక్షల కోట్లకు తగ్గ లెక్క ఆయన చెప్పారు. వీటిలో తప్పులు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలన్నారు. ఆధారాలతో సహా సమాధానమిస్తామన్నారు. జగన్‌కు ఇంత కన్నా మంచి అవకాశం ఉండదన్న వాదన వినిపిస్తోంది.
వైసీపీ హయాంలో అప్పులు చాలా తక్కువన్న జగన్
బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రెస్‌మీట్‌లో జగన్ అప్పులపై స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పుల్లో శ్రీలంకను మించిపోతోందని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముంగిట రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేశారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలను గవర్నర్ తో కూడా చెప్పించారన్నారు. కానీ బడ్జెట్‌లో అసలు నిజం చెప్పారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. 2024లో మేం అధికారం నుంచి దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లని, చంద్రబాబు హయాంలో అప్పులు 19 శాతం పెరిగితే తమ హయాంలో పెరిగిన అప్పుల శాతం 15 మాత్రమే అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Also Read: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు నిస్సారం - వైసీపీ సభకు వచ్చేలా టీడీపీ చర్చలు జరపదా ?
అప్పులపై అసెంబ్లీలో ప్రకటన చేసిన చంద్రబాబు
అప్పులపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లు ఉందన్నారు. రంగాల వారీగా ఆయన అప్పుల వివరాలు కూడా వెల్లడించారు. గవర్నమెంట్ అప్పులు రూ.4,38,278 కోట్లు , పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ - రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు రూ.36,000 కోట్లు, పవర్ సెక్టార్ అప్పులు రూ.34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ రూ.1,13,244 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ అప్పులు రూ. 21,980 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అప్పులు రూ.1,191 కోట్లు ఉన్నాయన్నారు. కాదని ఎవరైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుదామని సవాల్ చేశారు.
Also Read: సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
జగన్‌కు మంచి అవకాశం
తన హయాంలో ఎక్కువ అప్పులు చేయలేదని జగన్ వాదిస్తున్నారు. కానీ పది లక్షల కోట్లు అప్పు ఉందని ప్రభుత్వం ప్రకటించిది. ఇప్పుడు జగన్ మీడియా సమావేశాల్లో చెబితే వాస్తవాలు బయటకు రావు. ఎవరి వాదనలు వారు వినిపించినట్లవుతుంది. అదే అసెంబ్లీకి వచ్చి జగన్ తన వాదన వినిపిస్తే ప్రజలకు స్పష్టత వస్తుంది. చంద్రబాబు ప్రకటించిన అప్పుల వివరాల్లో తేడాలు ఉంటే ప్రజల ముందు పెట్టవచ్చు. ఒక వేళ మాట్లాడనివ్వకపోతే.. మైక్ ఇవ్వలేదనుకుంటే.. ఆ విషయంలో ప్రజలే అధికారపక్షాన్ని తప్పు పట్టే అవకాశం ఉంటుంది. తన హయాంలో జగన్ ఎక్కువ అప్పులు చేయకపోతే తన వాదన వినిపించడానికి ఇంతకు మించిన గొప్ప అవకాశం రాదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి జగన్ ఏం చేస్తారు ?