TDP MLAs Suspension: మళ్లీ గందరగోళం ! ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు.
AP Assembly News: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. నేడు ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి నిరసనలు చేశారు. వారి తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వీధి రౌడీలు కాదని, ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. అశోక్ బేందాలం, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, వెంకట నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామక్రిష్ణ, మంతెన రామరాజు, రవికుమార్ గొట్టిపాటి, సాంబశివరావు ఏలేరు, సత్యప్రసాద్ అనగానిలను ఒకరోజు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.
రగడ యథాతథం.. !
ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన హత్యలేనని, ఆయనే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ దీనిపై చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. కానీ అధికార వైఎస్సార్‌సీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను సభలో లేకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. మొదట గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డప్పటి నుంచి నేటి ఉదయం వరకు ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు పలుమార్లు సస్పెండ్ అయ్యారు. సోమవారం అసెంబ్లీ మొదలుకాగానే జంగారెడ్డి గూడెంలో మరణాలు, రాష్ట్రంలో కల్తీ సారా మరణాలు, కల్తీ మద్యం బ్రాండ్లపై సభలో చర్చ జరగాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
పెగాసస్ దుమారం..
అసెంబ్లీ మొదలుకాగానే పెగాసస్ స్పైవేర్ పై చర్చ జరపాలని అధికార వైఎస్సార్ సీపీ సభ్యులు తెరలేపారు. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై చర్చ కోసం పట్టుపట్టారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ వాడారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారంటూ వైసీసీ సభ్యులు అన్నారు. రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ సభ్యులకు ప్రతినిథిగా వ్యవహిస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని సస్పెండ్ చేశారు.
Also Read: Gudivada News : మంత్రి కొడాలి నాని-వంగవీటి రాధా భేటీ, ఏం మాట్లాడుకున్నారో అని ఆసక్తికర చర్చ!