Breaking News Live: ఐసీయూలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి.. !
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 2న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు 9 నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.
బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు : పవన్
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని తెలిపారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
ఐసీయూలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి.. !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరాకరించినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీగా వచ్చి ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ లాఠీఛార్జ్ లో హుజూరాబాద్ అభ్యర్థి, NSUI ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ తీవ్ర గాయలై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. దీంతో హుటాహుటిన వెంకట్ ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





















