Andhra News: మిగ్ జాం తుపాను ప్రభావం - జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
Michaung Special Officers: రాష్ట్రంలో మిగ్ జాం తుపాను ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.
Special Officers on Michaung Cyclone: మిగ్ జాం తుపాను (Michaung Cyclone) ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, తీర ప్రాంతాల్లో తీవ్ర అలజడి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాణ నష్టం లేకుండా చూడాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ (CM Jagan) అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను (Special Officers) నియమించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని నిర్దేశించారు.
అధికారులు వీరే
- బాపట్ల - కాటమనేని భాస్కర్
- అంబేద్కర్ కోనసీమ - జయలక్ష్మీ
- తూర్పు గోదావరి - వివేక్ యాదవ్
- పశ్చిమ గోదావరి - కన్నబాబు
- కాకినాడ - యువరాజ్
- ప్రకాశం - ప్రద్యుమ్న
- నెల్లూరు - హరికిరణ్
- తిరుపతి - శ్యామలరావ్
తీవ్ర తుపానుగా బలపడిన మిగ్ జాం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. మంగళవారం ఉదయం మచిలీపట్నం - బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఆ సమయంలో 110 కి.మీ. వేగంతో భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ వేగంతో తుపాను కదులుతోంది.
తీర ప్రాంతాల్లో బీభత్సం
మిగ్ జాం తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో తీవ్ర అలజడి నెలకొంది. తిరుపతి, నెల్లూరు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు సహా ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తుపాను తీరం దాటిన తర్వాత మంగళవారం అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయి. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
వర్షాలతో ప్రజల ఇబ్బందులు
తుపాను కారణంగా భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు తిరుమలలోనూ తుపాను ప్రభావంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తుపాను కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను టీటీడీ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటే శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలు నిలిపేశారు.
Also Read: తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!