YSRCP MP PV Midhun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు: అరెస్ట్ అవుతారా? విజయవాడలో హై అలర్ట్!
YSRCP MP PV Midhun Reddy:వైసీపీఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.

YSRCP MP PV Midhun Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కాక రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఢిల్లీలో ఉంటూ వచ్చిన ఆయన ఈ ఉదయం గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని సిట్ ఆఫీస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలు, రికార్డు చేసిన వాంగ్మూలాలు ఆధారంగా మిథున్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు.
కక్ష పూరిత కేసులు: మిథున్ రెడ్డి
సిట్ విచారణకు వెళ్లే ముందు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ కేసులు పెట్టడం వేధించడం పరిపాటిగా మారిందని అన్నారు. తమకు లొంగిపోయిన వారితో స్టేట్మెంట్‌లను నమోదు చేసి వాటి ఆధారంగా ప్రత్యర్థులను ఇరికించేలా కేసులు ఫైల్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసులతో తాము వెనక్కి వెళ్లే పరిస్థితిలేదని కచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు.
మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని అందులో తాను కూడా ఉన్నట్టు మిథున్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేవలం ఒకరిద్దరి స్టేట్మెంట్‌లను ఆధారంగా చేసుకొని ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తన పాత్ర ఉన్నట్టు ఒక్క ఆధారమైనా చూపించాలని సవాల్ చేశారు. తాము తప్పు చేయలేదని అందుకే ధైర్యంగా దర్యాప్తునకు హాజరవుతున్నట్టు వెల్లడించారు.
2014 నుంచి నేను టార్గెట్ అయ్యాను: మిథున్ రెడ్డి
ఎవరెవర్ని జైల్లో వేయాలో నిర్ణయించుకొని దాని ఆధారంగానే కేసులు పెట్టిస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. దీని కోసం కొందర్ని ప్రలోభపెట్టి స్టేట్మెంట్‌లు రికార్డు చేస్తున్నారని అన్నారు. ఇలా కట్టుకథలలతో నేతలను జైల్లో పెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగమని అన్నారు. తనను టార్గెట్ చేయడం ఇది కొత్త కాదని మిథున్ రెడ్డి ఆన్నారు. 2014 లో కూడా టార్గెట్ చేశారని గుర్తుచేశారు. అరెస్టు కూడా చేశారని అన్నారు.
అరెస్టు చేస్తారు బయటకు వస్తాను: మిథున్ రెడ్డి
నాడు అరెస్టు చేస్తే కోర్టుల్లో పోరాడి బయటకు వచ్చామని ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. ఇప్పుడు కూడా అరెస్టు చేస్తారని న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరెస్టు చేయడం తప్పడం మినహా ఏం చేయలేరని మిథున్ అన్నారు.
లిక్కర్ కేసులో నేడు విచారణ ఉన్నందున ముందస్తు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టులో రెండు చోట్ల కూడాఊరట లభించకపోవడంతో ఆయన అరెస్టు ఖాయమనే ప్రచారం గట్టిగా సాగుతోంది.
సిట్ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్
మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమంటు జరుగున్న ప్రచారంతో విజయవాడ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. సిట్ కార్యాలయం సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులను తప్ప వేరే ఎవర్నీ అటు వెళ్లనీయడం లేదు. వైసీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి తరలి వస్తారనే సమాచారంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చే వారిపై నిఘా పెట్టేందుకు చెక్‌పోస్టులు సిద్ధం చేశారు.





















