P. V. Midhun Reddy : మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట- లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకర ణ
P. V. Midhun Reddy :ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం కూడా నిరాకరించింది.

P. V. Midhun Reddy :ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌లో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ ఎంపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆఖరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేసేందుకు అంగీకరించలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ సంచలనాలు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతోంది. తవ్వేకొద్ది ఇందులో ఉన్న అసలు బాగోతం బయటకు వస్తోంది. ఇలాంటి కేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిని సిట్ అధికారులు పిలిచి విచారిస్తున్నారు. అలా వినిపించే పేర్లలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు కూడా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడికి రాజకీయ రంగప్రవేశం చేసినా క్రమంగా వైసీపీ కీలక నేతగా ఎదిగారు. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కోవడం భవిష్యత్‌లో ఇంకా ఎన్ని సంచలనాలు చూడబోతున్నామో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది.
ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణ ఎదుర్కొన్న మిథున్ రెడ్డి అరెస్టు నుంచి రక్షణ కల్పించమని కోర్టును ఆశ్రయించారు. మొదట రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మొన్నటి వరకు విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీకంకోర్టులో పిటిషన్ వేశారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులని, అసలు ఆ శాఖలతో అధికారులతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. లొంగిపోయేందుకు కూడా సుప్రీంకోర్టు సమయం ఇవ్వలేదు.హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన వెంటనే సిట్ అధికారులు ఆయనకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసులో ఉన్న నిందితులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మొన్నటి వరకు సిట్ విచారణకు హాజరుకాకుండా ముప్పుతిప్పలు పెట్టారు. విదేశాలకు పారిపోయేందుకు కూడా ట్రై చేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో అలాంటివి జరగకుండా ఉండేందుకు ఆయనపై ఎల్వోసీ జారీ చేశారు.ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాకపోవడంతో ఆయన అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.





















