AP Assembly Session : అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్, జంగారెడ్డి గూడెం ఘటనపై రచ్చ
జంగారెడ్డి గూడెం ఘటనపై అసెంబ్లీని కుదిపేసింది. చర్చకు పట్టు బట్టిన తెలుగుదేశం సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభాపతి ఛైర్‌పై గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభను జంగారెడ్డి గూడెం ఘటన తీవ్ర దుమారం రేపింది. ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేసినా ప్రతిపక్ష సభ్యులు శాంతించ లేదు. ఉదయం నుంచి పోడియంను చుట్టుముట్టి చర్చకు పట్టాబట్టారు. ఇలా ఈఘటన సభలో గందగోళం సృష్టించింది.
టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌ను సక్రమంగా నడపాల్సిన ప్రతిపక్షం అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. మిగతా సభ్యుల హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే అల్లరి చేయాలనే వ్యూహంతో ఛైర్‌ను చుట్టుముట్టి హంగామా చేస్తున్నారని దుయ్యబట్టారు.
సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల మంత్రి బుగ్గనను సూచించారు. పబ్లిక్‌కు తప్పుడు సంకేతం పంపించాలనే ఉద్దేశంతోనే టీడీపీ సభ్యులు హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని బుగ్గన ప్రకటించారు.
సభా వ్యవహారాల మంత్రి సూచనతో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
సస్పెండ్ చేసిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. స్పీకర్ పదే పదే చెబుతున్నా వినలేదు. సస్పెండ్ అయిన సభ్యులను మార్షల్స్ తీసుకెళ్లిపోయారు. మిగతా సభ్యులు పోడియం చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీడీపీ సభ్యుల తీరుపై కన్నబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు.
ఈ ఆందోళనల మధ్యే వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తన ప్రకటన కొనసాగించారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సహజ మరణాలను కూడా వేరే విధంగా జరిగినట్టు అపోహ కల్పిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదో రచ్చ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసలు జంగారెడ్డి గూడెంలో ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. తనకు ఎక్కడ అధికారం రాదో అన్న కంగారులో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
జంగారెడ్డి గూడెంలో లేని సమస్యను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు కల్పించి ప్రభుత్వం విఫలమైందని నిరూపించేందుకు యత్నిస్తున్నారన్నారు. అసలు చనిపోయింది నలుగురైతే... కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాతిలో నొప్పి వస్తుందని ఉపేంద్రను ఆసుపత్రిలో చేరాడని సభలో వివరించారు ఆళ్ల నాని. ఆ రోజే ఈసీజీ తీశారని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన భార్య కూడా చెప్పారన్నారు. ఆయన గుండె నొప్పితో చనిపోతే దాన్ని కూడా మద్యం తాగినట్టు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పద్దెనిమిది మంది చనిపోయింది ఒకే కారణం, ఒకే రోజు కదాన్నారు ఆళ్లనాని. రకరకాల కారణాలతో చనిపోయారని.. వెంటనే బంధువులు అంతిమ సంస్కారాలు కూడా జరిపించారని పేర్కొన్నారు. ఓ వ్యక్తి చనిపోతే ఇంటికి తీసుకెళ్లి బంధువులు అంతిమ కార్యక్రమాలు చేపట్టారు. ఇరవై నాలుగు గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టు మార్టం పూర్తి చేశామన్నారు.
నిజంగా ఏదైనా జరిగి ఉంటే డెడ్‌బాడీలను బయటకు తీసి పోస్టుమార్టం ఎందుకు చేస్తామో ఆలోచించాలన్నారు ఆళ్లనాని. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని ఏరులై పారించారో అందరికీ తెలుసన్నారు. ఇంటింటికీ బెల్ట్‌షాపు వచ్చిందని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం రేట్లు భారీగా పెంచామన్నారు. మద్యం వినియోగం తగ్గుతుందని రేట్లు పెంచామన్నారు. చంద్రబాబు కపట నాటకాలను ప్రజలు గమనించాలని సూచించారు ఆళ్లనాని.
జంగారెడ్డి గూడెం ఘటన జరిగిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేసు దర్యాప్తు చేయాలని జగన్ సూచించారని సభకు వివరించారు ఆళ్ల నాని. గిరిజన ప్రాంతం, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ మద్యం వచ్చిందేమో చూడాలన్నారని తెలిపారు. అక్రమ మద్యం ప్రజల ప్రాణాలు హరించకుండా ఎస్‌ఈబీని ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.
చనిపోయిన వారిలో చాలామందికి మద్యం అలవాటు ఉందన్నారు మంత్రి ఆళ్లనాని. ఒక వ్యక్తి రాత్రి పగలు తిండి లేకుండా మద్యం తాగి చనిపోయినట్టు పేర్కొన్నారు. ఇలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. ఇంటింటికీ సర్వే నిర్వహించి స్పెషలిస్టులను విజయవాడ నుంచి తీసుకెళ్లి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చూస్తున్నామన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. అక్రమ మద్యం ఉంటే కచ్చితంగా తొక్కిపెట్టి నార తీస్తామన్నారు.