TDP MLC Anuradha: మంగళగిరిని ప్రోటోకాల్ కేంద్రంగా ఎంచుకున్న ఎమ్మెల్సీ అనురాధ, హాట్ టాపిక్ గా టీడీపీ ప్లాన్ బీ!
TDP MLC Anuradha: ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మంగళగిరిని కేంద్రంగా చేసుకొని తన లోకల్ ప్రోటోకాల్ అవకాశం కల్పించాలని సర్కార్ కు దరఖాస్తు చేసుకున్నారు.
TDP MLC Anuradha: మంగళగిరిలో తెలుగు దేశం పార్టి ప్లాన్ బీ రెడీ అయ్యిందా. అభ్యర్ది మార్పునకు సంబంధించిన సంకేతాలు అందుతున్న క్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరి కేంద్రంగా ప్రోటోకాల్ ను ఎంచుకోవటం చర్చనీయాశంగా మారింది.
మంగళగిరిలో ప్రోటోకాల్....
తెలుగు దేశం పార్టి తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ, మంగళగిరిని కేంద్రంగా చేసుకొని తన లోకల్ ప్రోటోకాల్ అవకాశం కల్పించాలని సర్కార్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రేవు ముత్యాల రాజుకు తెలియజేశారు. మంగళగిరి కేంద్రంగా పంచుమర్తి అనురాధ కు లోకల్ ప్రోటోకాల్ రావడం వల్ల, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అంతే కాదు మంగళగిరి కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా సమావేశాల్లో కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది. దాంతో మంగళగిరిలో రాజకీయాలు మారనున్నాయి.
మంగళగిరిలో టీడీపీ ప్లాన్ ఇదేనా...
ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గం కు ఇంచార్జ్ గా నారా లోకేష్ పని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లోకేష్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్రలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి లోకేష్ ఓటమి పాలవటంతో మళ్లీ అక్కడే గెలుపొందాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే లోకేష్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇదే సమయంలో లోకేష్ వేరొక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని సైతం ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాజాగా మంగళగిరిని కేంద్రంగా చేసుకొని శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ ప్రోటోకాల్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోవటం సంచలనానికి కేంద్రంగా మారింది.
మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు దేశం వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే పంచుమర్తి అనురాధ ప్రోటోకాల్ పాటింపులకు కేంద్రంగా మంగళగిరిని ఎంచుకున్నారని అంటున్నారు. పంచుమర్తి అనురాధ పద్మశాలీయ సామాజిక వర్గానికి చెందిన మహిళ నియోజకవర్గంలో పద్మశాలీ వర్గం కూడా అధికంగా ఉంటుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్దుల ఫైనల్ లిస్ట్ తో పాటుగా, నామినేషన్ల ఆఖరి గట్టంలో పంచుమర్తి అనురాధ రంగంలోకి దింపే అవకాశం ఉందా అనే ప్రచారం మెదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన రెండు సార్లు విజయం సాధించిన ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డికి చెక్ పెట్టేందుకు తెలుగు దేశం వ్యూహం రచించిందని ఊహగానాలు వస్తున్నాయి.
గంజి చిరంజీవికి ధీటుగా....
తెలుగు దేశం పార్టిలో గతంలో పని చేసిన మంగళగిరి కార్పోరేషన్ ఛైర్మన్ గంజి చిరంజీవి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తరువాత నియోజకవర్గంలో తెలుగు దేశానికి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ పరిస్దితులను అధిగమించేందుకే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అనురాధ మంగళగిరిలో ఎంట్రీ ఇవ్వటానికి మార్గం సుగుమం చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టిలో అత్యంత సీనియర్ కావటం, బీసీ వర్గానికి చెందిన మహిళ కావటం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన అనురాధ అయితే నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో లోకేష్ ఎట్టి పరిస్దితుల్లో మంగళగిరి నుంచే మరోసారి బరిలోకి దిగుతారని పార్టీ నేతలు అంటున్నారు. ఓటమి పాలైన చోటే తిరిగి విజయం సాధిస్తారని ధీమాగా చెబుతున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉండటంతో నియోజకవర్గంలో టీడీపీ తరపున సీరియస్ పాలిటిక్స్ నడిపే నేత కరువయ్యారు. ఆ లోటును అనురాధతో భర్తీ చేయించాలని భావిస్తున్నట్లుగా పార్టి నేతలు చెబుతున్నారు.