AP Capital అమరావతిని గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరు, చాలా సేఫ్ సిటీగా అభివృద్ధి: మంత్రి నారాయణ
AP Minister Narayana | అమరావతిలో నిర్మాణం జోరుగా కొనసాగుతోందని, 13000 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన బుధవారం నాడు రాజధానిలో పనులు పరిశీలించారు.

Andhra Pradesh News | అమరావతి రాజధానిలో నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నేలపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడి పనులను సమీక్షించి, అధికారులతో మంత్రి నారాయణ మాట్లాడారు.
అమరావతి గ్రాఫిక్స్ కాదు
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ మాట్లాడుతూ, "అమరావతి గ్రాఫిక్స్‌ల కోసం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం నిర్మించుకుంటున్నాం. అమరావతి అంటే ప్రజలకు అభిమానం ఉంది. గ్రాఫిక్స్ చూపిస్తూ మభ్యపెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు. అమరావతి చాలా సేఫ్ సిటీ. ఎలాంటి అనుమానం లేదు" అని అన్నారు.

కార్మికుల కృషితో వేగంగా అభివృద్ధి
ప్రస్తుతం అమరావతిలో సుమారు 13,000 మంది కార్మికులు వివిధ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. అధికారులు నివసించేందుకు కావలసిన ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని చెప్పారు. గ్రూప్-1 అధికారుల కోసం 720 ప్లాట్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి నవంబర్ చివరి వరకు పూర్తి కానున్నాయని తెలిపారు.
డిసెంబరులో నిర్మాణాల పూర్తి
అదే విధంగా వచ్చే నెలలో గ్రూప్-డి ఉద్యోగుల కోసం జరుగుతున్న నిర్మాణాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. “అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాతే అధికారులకు గృహాలు కేటాయిస్తాం. అప్పటివరకు సహనంగా ఉండాలి” అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

అసత్య ప్రచారాలపై ఆగ్రహం
ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి అసత్యాలు చెబుతున్నవారిని ప్రజలు ఇదివరకే తిరస్కరించారు. ప్రజలు కూడా వైసీపీ నిర్ణయాలను, దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి ప్రజలు మద్దతు ఇస్తున్నది అమరావతికే” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.























