Smart Ration Cards: సోమవారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ఎక్కడ తీసుకోవాలి అంటే..
Smart Ration Cards: ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయనుంది.

Smart Ration Cards: రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని మంత్ర నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చోయబోతున్నట్టు వెల్లడించారు. కానూరులోని సివిల్ సప్లైస్ భవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శుక్రవారం వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు అందజేశారు. సామాన్యుడిని ఆదుకునే విధంగా నిజాయితీతో పనిచేయాలని ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తుంటారని,ఆవిధంగా పనిచేస్తున్నామన్నారు. ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టామన్నారు. నాలుగు దశల్లో 1 కోటీ 45 లక్షల స్మార్డ్ కార్డుల పంపిణీ ఆయా రేషన్ కార్డుల దుకాణాల వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో పంపిణీ చేస్తున్నామన్నారు.
6,71,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, 16,67,032 రేషన్ కార్డుల అప్లికేషన్స్‌కి అప్రూవల్ ఇచ్చామని నాదెండ్ల తెలిపారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియని, ఆన్ లైన్‌లో ధరఖాస్తు ప్రక్రియ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. రేషన్ పంపిణీ 93 శాతానికి పెరిగిందన్నారు. రేషన్ డెలివరీలో సర్వీసు పెరిగిందన్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి సంబంధిత సిబ్బందికి శిక్షణ అందించామన్నారు.పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు సాంకేతికత ఉపయోగించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
భారీ స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం దేశంలో బహుశా ఇదే మొదటిసారి అని అన్నారు. స్మార్ట్ కార్డుల్లో ప్రభుత్వ చిహ్నంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, సేఫ్టీ కోసం క్యూఆర్ కోడ్, కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుందన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చన్నారు. 2 నెలలుగా స్మార్ట్ రేషన్ కార్డుల కసరత్తు చేశామన్నారు. చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. స్మార్ట్ కార్డులు రాష్ట్రం నుంచి జిల్లాకు అక్కడ నుంచి మండలాలకు, మండలాల నుంచి ఆయా రేషన్ షాపులకు బాక్స్ ల్లో భద్రంగా క్యూఆర్ కోడ్ తో చేరుస్తామన్నారు. దీనివల్ల ట్రేస్‌బులిటీ సులువుగా ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రతి నెలా దివ్వాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన దాదాపు 16,73,000 మందికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు.
ఆగస్టు 25 నుంచి 9జిల్లాలలో ఉచిత స్మార్ట్ కార్డుల పంపిణీని మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభిస్తారన్నారు నాదెండ్ల. మొదటి విడత 25.08.2025 నుంచి 9 జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు, రెండో విడత 30.08.2025 నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, మూడో విడత 06.09.2025 నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, నాలుగో విడత 15.09.2025 నుంచి 8 జిల్లాలు బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారన్నారు.
గ్రామ/వార్డు స్థాయిలో యాప్ ఏర్పాటు చేశామని అంతేకాకుండా డాష్ బోర్డు ద్వారా స్మార్ట్ కార్డు వివరాలు కూడా చూడొచ్చన్నారు. వలస వెళ్లిన వారు నమోదు చేసుకున్న రేషన్ షాపు వద్దనే స్మార్ట్ కార్డు తీసుకోవాలని, ఇప్పటికే రేషన్ ను ఎక్కడైనా తీసుకునే విధంగా పోర్టబులిటీ చేయడం జరిగిందన్నారు. నాలుగు విడతల్లో పంపిణీ చేసేవిధంగా ప్లాన్ చేయడం జరిగిందని, ఏవిధమైన ఆలస్యం లేకుండా పంపిణీకి చర్యలు చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.





















