CM Chandrababu: జనాభా నియంత్రణతో చాలా నష్టపోయాం, ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలి: సీఎం చంద్రబాబు
Andhra Pradesh News | జనాభా నియంత్రణతో చాలా నష్టపోయామని, భవిష్యత్తులో జనాభా నిర్వహణకు పాలసీలు తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

World Population Day 2025 | అమరావతి: ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలని, ప్రస్తుతం చేయాల్సింది జనాభా నియంత్రణ కాదని.. నిర్వహణ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జనాభాను భారం కాకుండా, ఆస్తిగా భావించే రోజులు వచ్చాయన్నారు. మితి మీరిన జనాభా నియంత్రణ వల్ల ఎంతో నష్టపోయామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్ని సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కొన్ని దేశాల్లో సంతానోత్పత్తి తగ్గడంతో ఏజింగ్ సమస్య వచ్చిందని, యువత తగ్గడంతో అక్కడ పనిచేసే శక్తి తగ్గిపోయిందన్నారు.
‘ప్రపంచంలో పలు దేశాల్లో పిల్లలను కనడం తగ్గించారని, దాని వల్ల అక్కడ శ్రామిక శక్తి తగ్గిపోయి సంపాదించే వారు తగ్గిపోతన్నారు. మొన్నటివరకూ ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశారు. ఇప్పుడు జనాభా నిర్వహణపై ప్లాన్ చేయాలి. రాష్ట్ర, భారత్ భవిష్యత్తు కోసం పనిచేయాలి. వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంద్ర 2047 సక్సెస్ కావాలి. జనాభానే మన ఆస్తి, మన సంస్థ. అభివృద్ధి చెందాలంటే యువత కావాలి. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అగ్ర స్థానంలో ఉండటం మనకు గర్వకారణం. దేశమంటే మనుషులు అనే నినాదానికి తగ్గట్లుగా పనిచేసి ఫలితాలు సాధించాలి.
గతంలో స్థానిక సంస్థల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని చట్టం తీసుకొచ్చాం. నేడు జనాభా నిర్వహణ కోసం ప్రయత్నిస్తున్నాం. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలసీలు తీసుకొస్తాయి. లేకపోతే సమస్యలు తప్పవు. ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలి. దాంతో ప్రతిరోజూ కుటుంబసభ్యులు కూర్చుని మాట్లాడుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరకుతుంది. 2.1 గా ఉండే ప్రత్యుత్పత్తి రేటు 1.7కి పడిపోయింది. ప్రజలు లేకపోతే అభివద్ధి లేదు. త్వరలోనే జనాభా నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు ముఖ్యంగా యువతే ఆస్తిగా మారుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఓ కుటుంబంలో 7 మంది ఉంటే అందరికి తల్లికి వందనం ఇచ్చాం. జనాభా నిర్వహణపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అది నిదర్శనం.
మహిళలకు అవకాశాలు ఇచ్చిన పార్టీ టీడీపీ
‘దక్షిణ భారతదేశంలో చర్చ జరుగుతోంది. ఇక్కడి జనాభా తగ్గింది కనుక పార్లమెంట్లో సీట్లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో అభివృద్ధి అయింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వసతులు మెరుగయ్యాయి. జనాభా నియంత్రణ చేయాలని అనుకున్నప్పుడు సవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాం. మహిళలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ తీసుకొచ్చిన చట్టంతో మహిళలకు ఆస్తి హక్కు వచ్చింది. మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎన్టీఆర్. ఇంటికి పరిమితమైన మహిళల్ని డ్వాక్రా, మెప్మా ద్వారా వారికి అవకాశాలు కల్పించాం. భవిష్యత్తులోనూ పనిచేసేలా ఆలోచించాం. సమైక్యాంధ్రలో దేశంలోనే తొలిసారిగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ప్రభుత్వం మాది. ఇంటి పనుల్లో మగవాళ్లు సహకరించాలని సూచించాం. ఆడబిడ్డలు సంపాదనకు బయటకు వెళ్లి వస్తే ఇంటికి వచ్చాక వారికి టీ పెట్టి ఇవ్వాలని మగవారికి చెప్పాం. కాలేజీల్లో వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాం’ అన్నారు.






















