Chandrababu :ఎలక్షన్ తర్వాత జగన్ మళ్లీ జైలుకే, అయ్యన్న అరెస్టుపై చంద్రబాబు వార్నింగ్
Chandrababu : వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల స్టేట్మెంట్ ను డైవర్ట్ చేసేందుకు అయ్యన్న పాత్రుడి అరెస్టు అని చంద్రబాబు ఆరోపించారు.
Chandrababu : రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అరాచక పాలనకు నిదర్శనం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు అని విమర్శించారు. ఎప్పుడైనా ఒక బలమైన సమస్య వచ్చినప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలను అక్రమ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో సీఎం సోదరి వైఎస్ షర్మిల సీబీఐకు స్టేట్మెంట్ ఇచ్చారని, ఎవరు చంపారో ఆమె స్పష్టం చెప్పారన్నారు. అలాగే విశాఖపట్నంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్, ఆస్తుల దురాక్రమణ వీటిపై పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రుషికొండపై అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారన్నారు. రుషికొండ తవ్వకాలపై సర్వేకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ కేసుల నుంచి ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అయ్యన్నపాత్రుడును అరెస్టు చేశారని ఆరోపించారు. అయ్యన్నను తెల్లవారు జామున 3 గంటల సమయంలో అరెస్టు చేశారన్నారు. అయ్యన్న ఏమైనా హత్యలు చేశారా?, అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగల మాదిరి అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేశారని అయ్యన్న సతీమణి ఆవేదన చెందారన్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, అందరూ భయపడిపోయారని, కొందరు తాగిన మైకంలో ఉన్నారని అయ్యన్న భార్య చెప్పారని చంద్రబాబు అన్నారు.
ఇడుపుల పాయలో భూ కబ్జా
"అయ్యన్న పాత్రుడుని కనీసం చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా లాక్కెళ్లారు. కొందరు పోలీసుల తీరు అభ్యంతరంగా ఉంది. పోలీసులకు ధైర్యం ఉంటే వివేకాను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోండి. అయ్యన్న కుటుంబం దాదాపు 60 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో వందల ఎకరాలు దానం చేశారు. అందుకే ఓ ఊరికి అయ్యన్నపాలెం అనే పేరు కూడా పెట్టుకున్నారు. అయ్యన్న పాత్రుడు రెండు సెంట్లలో పర్మిషన్ లేకుండా ఇళ్లు కట్టారని కేసు పెట్టారు. ఇడుపుల పాయలో 650 ఎకరాలు భూ కబ్జా చేస్తే హెలికాఫ్టర్ పంపించి ఏరియల్ సర్వే చేయించి అసెంబ్లీలో పెట్టాం. దానిపై మా నాన్నకు తెలియక చేశారని సీఎం జగన్ చెప్పారు. ఈ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో లాండ్ గ్రాబింగ్ లో ఇళ్లు కట్టారు. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టా భూమి చేసుకుని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. మంగంపేట బైరేటీస్ అక్రమంగా తవ్వుకుపోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తిని ఆక్రమించారు. అయ్యన్న ఆయన సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటే 2 సెంట్లకు పర్మిషన్ లేదని అక్రమ కేసు పెట్టారు." - చంద్రబాబు
సీఐడీ ఆఫీస్ తప్పుల కేసుల నిలయం
ఎవరైతే అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారో వారిని వదిలిపెట్టామని చంద్రబాబు హెచ్చరించారు. కొందరు రిటైర్డ్ అధికారులను పెట్టుకుని ప్రభుత్వం అరాచక పనులు చేయిస్తుందని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను శారీరకంగా బాధపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్యే కేసులో సీఐ మెజిస్ట్రేట్ వద్దకు వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆయనను ప్రలోభపెట్టి మళ్లీ సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టారని ఆరోపించారు. సస్పెండ్ అయిన సీఐకి ప్రమోషన్ ఇచ్చి సీబీఐపై కేసులు పెట్టించారన్నారు. ఇదే విధంగా అయ్యన్న కేసులో జరిగిందన్నారు. భూమి చింతకాయల విజయ్, రాజేశ్ పేరుపై ఉంటే అయ్యన్న పాత్రుడిపై ఎందుకు కేసు పెట్టారని మండిపడ్డారు. ఏవిధంగా ఏ1 కింద వస్తారో చెప్పాలని నిలదీశారు. రెండు సెంట్లకు ఎన్వోసీ ఇచ్చారని ఓ అధికారిని పట్టుకుని తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందం కోసం ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు. సీఐడీ ఆఫీసు ఇలాంటి తప్పులు కేసులు పెట్టేందుకు నిలయంగా మారిందన్నారు. ఈ ఆఫీస్ టార్చర్ ఆఫీసులా మారిందన్నారు. ఈరోజు ఆఫీసర్లను భయపెట్టి అక్రమ కేసులు పెడితే రేపు అదే అధికారులు మీకు వ్యతిరేకంగా చెప్పరా? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు సతీమణి మాట్లాడుతూ 43 ఏళ్లుగా ఇలాంటి టెర్రరిజాన్ని చూడలేదన్నారని చంద్రబాబు స్పష్టంచేశారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తప్పుడు పనులు చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. 175 గెలుస్తానంటూరని, కానీ ఎలక్షన్ అయ్యాక జగన్ మళ్లీ జైలుకు, వైసీపీ బంగాళాఖాతంలోకి వెళ్తుందన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడితే వైసీపీ నేతలు ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేరన్నారు.