(Source: Poll of Polls)
తెలుగు రచయితల మహాసభలపై అధికార భాషా సంఘం ఆగ్రహం
తెలుగు రచయితల మహాసభలపై అధికార భాషా సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. భాషా వేదికపై రాజకీయా ప్రస్థావించడం సరికాదన్నారు.
విజయవాడ వేదికగా నేడు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. సిద్ధార్థ కళాశాల వేదికగా ప్రారంభమైన ఈ సభల కోసం తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. స్వభాషను రక్షించుకుందాం. స్వాభిమానం పెంచుకుందామన్న నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ మహాసభల్లో వేలాదిగా సాహితీ ప్రముఖులు, భాషాభిమానులు హాజరయ్యారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన రాజరాజ నరేంద్రుడి పేరును సభాప్రాంగణానికి పెట్టారు. మిగిలిన మూడు వేదికలకు ఆదికవి నన్నయ, పి.వి.నరసింహారావు, ఎన్టీఆర్ పేర్లను పెట్టారు. ఈ సభలో పాల్గొన్న ప్రముఖులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ఇంకా అనేక మంది రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఈ మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎలుగెత్తి చాటారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ఆకాంక్షించారు.
అధికార భాషా సంఘం మండిపాటు
భాషను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అనే పేరుతో సభలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కేవలం ప్రభుత్వ నిధులతోనే అధికార భాష, మాతృభాష అయిన తెలుగును పరిరక్షించుకొందాం అనే భావన సరికాదన్నారు. ప్రతి తెలుగువాడు తన మాతృ భాష అయిన తెలుగు భాష అభివృద్దికి, పరిరక్షణకు తనవంతు సహాకారాన్ని అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే స్వభాషను రక్షించుకుందాం…స్వాభిమానం పెంచుకుందాం” అనే నినాదంతో ఈ మహా సభలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అని, ఈ భాషకు సుదీర్ఝమైన ప్రాచీన చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. 56 అక్షరాలతో రూపుదిద్దుకున్న తెలుగు భాష నాశనం లేని అజంత భాష అని, అటు వంటి భాషను రక్షించుకుందాం…స్వాభిమానం పెంచుకుందాం అనే నినాదంతో మహా సభలు నిర్వహించడం సరికాదన్నారు.
అసలు ఇప్పుడు తెలుగు భాషకు ఏమైందని, అటు వంటి నివాదంతో ఈ తెలుగు మహా సభలను నిర్వహించడం ఏమిటని విజయబాబు ప్రశ్నించారు. ప్రపంచంలోని అనేక భాషలు మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రపంచీకరణ నేపధ్యంలో అనేకమైన అన్యభాషా పదాలను తమలో చేర్చుకుంటా ఎంతో పరిపుష్టంగా పరిఢవిల్లుతున్నాయన్నారు. అయితే భాషను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదని నిర్వాహకులకు ఆయన హితవు పలికారు. దేశ విదేశాల నుండి రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఈ తెలుగు రచయితల మహా సభకు తరలి వస్తున్నారని నిర్వాహకులు తెలుపుతున్నప్పటికీ రాష్ట్రంలోని పలువురు రచయితలను, కవులను, సాహితీ వేత్తలను ఈ సభలకు ఆహ్వనించకపోవడం శోచనీయమైన విషయం అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన అందజేయాలని ఆంగ్లమాద్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే తెలుగు భాష అంతరించిపోయినట్లా అని నిర్వాకులను ఆయన ప్రశ్నించారు.