Amara Raja Batteries News: అమర రాజా కంపెనీకి భారీ ఊరట.. కాలుష్య కంపెనీల జాబితాలో లేదన్న కేంద్రం
అమర రాజా కాలుష్యం వెదల్లుతుంది అని ఏపీ ప్రభుత్వం పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమర రాజా కంపెనీకి ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అమర రాజా కంపెనీలకు తాజాగా భారీ ఊరట లభించింది. గత కొన్నిరోజులగా నెలకొన్న వివాదానికి దాదాపుగా పరిష్కారం లభించినట్లయింది. అమర రాజా బ్యాటరీస్ కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఏపీ ప్రభుత్వం పలుమార్లు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో దీనిపై క్లారిటీ లభించింది. కాలుష్య కారక కంపెనీల జాబితాలో అమర రాజా బ్యాటరీస్ లేదని.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ అశోక్ బాజ్ పాయ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. సిమెంట్ కంపెనీలు, థర్మల్, పవర్ ప్లాంట్ లాంటి 17 పరిశ్రమలను కాలుష్యాన్ని వెదజల్లే కారకాలుగా గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది.
చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు-పలమనేరు రహదారిలో అమర రాజా యూనిట్లు ఉన్నాయి. అయితే వీటి నుంచి భారీగా కాలుష్యం వెదజల్లుతుందని, ఇవి ప్రమాదకరమని గతంలో పలుమార్లు ఆరోపణలున్నాయి. ఈ రెండు యూనిట్లు ప్రమాదకరమని వీటి నుంచి నియంత్రణ చేయలేని స్థాయిలో కాలుష్యం విడుదల అవుతుందని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ ఇటీవల పేర్కొన్నారు. ఈ మేరకు అమర రాజా యూనిట్లకు నోటీసులు సైతం జారీ చేశారు.
Also Read: చిత్తూరు, తిరుపతిలో ఉన్న అమరరాజా యూనిట్లు ప్రమాదకరం…తరలించమని మేమే చెప్పాం
అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్‌ను ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని, వేరే ప్రాంతానికి తరలించాలని నోటీసులలో సూచించారు. లేనిపక్షంలో తాము సూచించిన తీరుగా వీటిని నిర్వహించాలని సైతం ఏపీ సర్కార్ పలుమార్లు సూచించింది. ఈ యూనిట్ల కారణంగా పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో కాలుష్యం విడుదలై, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది.
అమర రాజా బ్యాటరీ యూనిట్లను కాలుష్య కారక కంపెనీల జాబితాలో చేర్చలేదని కేంద్రం నుంచి సమాధానం రావడంతో ఊరట లభించింది. బ్యాటరీస్ పరిశ్రమలను అతి కాలుష్య కారక 17 పరిశ్రమల జాబితాలో చేర్చలేదని.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ అశోక్ బాజ్ పాయ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. పవర్ ప్లాంట్, సిమెంట్, థర్మల్ కంపెనీలను అతి కాలుష్య కారకాలుగా గుర్తించినట్లు ప్రకటించింది. కాగా, అమర్ రాజా అమరరాజా గ్రూప్ తరలివెళ్లాలని తమ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకు రాలేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. గాలి, నీటిని కలుషితం చేయకుండా యూనిట్లను నిర్వహిస్తే ఏ అభ్యంతరాలు లేవన్నారు.
Also Read: అమరరాజా చిత్తూరులో ఉండొచ్చు.. కానీ "ఆ" షరతులు పాటించాల్సిందేనని తేల్చి చెప్పిన సజ్జల..!