Sajjala : అమరరాజా చిత్తూరులో ఉండొచ్చు.. కానీ "ఆ" షరతులు పాటించాల్సిందేనని తేల్చి చెప్పిన సజ్జల..!
కాలుష్య నిబంధనలు పాటిస్తూ ఉత్పత్తి చేసుకోవడానికి అమరరాజాకు ఎలాంటి ఇబ్బంది లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయేలా ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలు పాటిస్తూ అమరరాజా కంపెనీ ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తే తమకేమీ అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అమరరాజా ప్లాంట్ తమిళనాడుకు తరలిస్తున్నారన్న ప్రచారం నేపధ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... " వారు వెళ్లిపోవడం కాదు.. తామే దండం పెట్టి పొమ్మని కోరుతున్నామని " చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన తిరుపతికి వచ్చిన సందర్భంగా మీడియా ఆయనను చుట్టుముట్టింది. అమరరాజా సంస్థపై చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరరాజా ఫ్యాక్టరీ ఆంధ్రలో ఉంటే మాకెలంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.
ఏపీ నుంచి వెళ్లిపోయేలా... అమరరాజా గ్రూప్‌పై ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకు రాలేదని స్పష్టం చేశారు. గాలి,నీటిని కలుషితం చేయకుండా ఫ్యాక్టరీని నిడిపితే అభ్యంతరాలు లేవని ... ఆ నాడే ఫ్యాక్టరీ యాజమాన్యంకు తెలిపామని గుర్తు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సూచనల అమలు చేస్తూ అమరరాజా ఫ్యాక్టరీని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అమరరాజా సంస్థ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచామని సజ్జల తెలిపారు. కోర్టు తీర్పును వెల్లడిస్తూ రెండు నెలల కాలం పాటు అమరరాజా ఫ్యాక్టరీకి గడువు ఇచ్చిందని అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమి లేదన్నారు. .అమరరాజా కంపెనీ నుండి వెలువడే లెడ్ లాంటి విష పదార్ధాలు నీటిని కలుషితం చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ కారణంగానే పర్యావరణం కలుషితం చేసే ఫ్యాక్టరీలపై కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోందని... ..మొత్తం 60 ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకున్నామని అందులో ప్రస్తుతం 50 ఫ్యాక్టరీలను మూసి వేసినట్లు తెలిపారు.
అమరరాజా సంస్థ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది కావడంతో ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థను.. ఇలా పొరుగు రాష్ట్రాలకు పంపేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. కొత్త పరిశ్రమలు తీసుకు రాకుండా.. ఉన్న పరిశ్రమల్ని పంపిస్తే.. యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయని... వివిధ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం .. అమరరాజా సంస్థను.. పొల్యూషన్ లేకుండా.. నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తే.. తమకేమీ అభ్యంతరం లేదని చెబుతోంది. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఈ మొత్తం వివాదంపై అమరరాజా కంపెనీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.