AP Financial Status : 662 శాతం లోటు ! పతనం అంచున ఏపీ ఆర్థిక వ్యవస్థ ?
ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నట్లుగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సంర 6 నెలల్లో ఆదాయం రూ. 40 వేలు కోట్లు పెరిగినా రెవిన్యూ లోటు ఏకంగా 662శాతంగా తెలింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ రెండేళ్ల నుంచి చర్చనీయాంశంగానే ఉంది. పరిస్థితి తాజాగా అదుపు తప్పిపోయిందన్న అభిప్రాయం ఆర్థిక శాఖ అధికారుల్లోనూ బలంగా వినిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే బడ్జెట్ అంచనాలకు మించి ఆర్థిక లోటు ఏకంగా 662 శాతం అధికంగా నమోదైంది. అది అసాధారణం. ఇలాంటి పరిస్థితిలో వ్యవస్థ కుప్పకూలడం మినహా ఎలాంటి పరిస్థితుల్లోనూ మళ్లీ నిలబెట్టే అవకాశం ఉండదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రెవిన్యూ లోటు అంచనా రూ.5 వేల కోట్లు.. ఆరు నెలల్లోనే రూ. 33 వేల కోట్ల లోటు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రెవిన్యూ లోటును రూ. 5000.08 కోట్లుగా నిర్ధారించారు. బడ్జెట్ అంచనాలకు కొద్దిగా అటూ ఇటూ ఉండటం సహజమే. అలా ఉంటే ఏదో విధంగా కవర్ చేసుకుంటారు. కానీ రెవిన్యూ లోటు తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.33,140.62 కోట్లుగా నమోదయింది. అంటే 662 శాతం అధికమన్నమాట. ఎలా చూసినా ఇంత పెద్ద మొత్తం లోటును భర్తీ చేసుకోవడం అసాధ్యం. ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన లేకపోవడమే దీనికి కారణం. వస్తున్న ఆదాయానికి చేస్తున్న చెల్లింపులకు హస్తిమశకాంతరం ఉంటోంది. జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చెల్లింపులు సహా అనేక అంశాల్లో ప్రభుత్వం చెల్లింపులు చేయడానికి అవసరమైన వాటికి.. వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటం లేదు.
భారీగా ఆదాయం, కేంద్ర గ్రాంట్లు.. అయినా లోటే !
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పన్నుల ఆదాయం అమాంతం పెరిగింది. తొలి ఆరు నెలల్లో ఏపీకి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం రూ. 1,04,804.91 కోట్లు. ఇందులో రూ. 39,914.18 కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు.. కాకుండా పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 64,871.69 కోట్లు. ఇది గత ఏడాది కన్నా రూ. 19,956.17 కోట్లు ఎక్కువ. ఇంత భారీగా పన్నుల ఆదాయం పెరగడం అసాధారణం. అయినప్పటికీ ప్రభుత్వం మద్యం రేట్లు భారీగా పెంచడం సహా అనేక రకమైన పన్నులను విధించడంతో ఈ ఆదాయం కళ్ల జూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు కూడా అనూహ్యంగా పెరిగాయి. గతంలో రూ. నాలుగు వేల కోట్లకు అటూ ఇటుగా వచ్చి న గ్రాంట్లు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ. 18,117.56 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. ఎలా చూసినా ప్రభుత్వానికి పన్నులు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ. నలభై వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. ఇంత భారీ ఆదాయం వచ్చినప్పుడు ప్రభుత్వం ఇంకా బాగా ఆర్థిక నిర్వహణ చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇంత ఆదాయం వచ్చినా అప్పులు కూడా భారీగా చేస్తోంది.అలవి మాలిన ఖర్చులు చేస్తోంది.
Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !
కార్పొరేషన్ల అప్పులు కాకుండానే రూ. 40 వేల కోట్ల రుణాలు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న రూపాల్లో అప్పులు చేస్తోంది. కార్పొరేషన్లను పెట్టి భూములు, ప్రభుత్వ ఆస్తులు తనఖాలు పెట్టి అప్పు చేస్తోంది. అవి కాకుండా బహిరంగ మార్కెట్ నుంచి కేంద్ర ప్రభుత్వ అనుమతితో చేసే రుణాలు బడ్జెట్ లెక్కల్లో ఉంటాయి. ఇవి తొలి ఆరు నెలల్లోరూ. 39,914.18 కోట్లుగా లెక్క తేలాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 37,029.79కోట్లు మాత్రమే అప్పులు చేస్తామని చెప్పింది. కానీ ఆరు నెలలకే ఆ పరిమితి దాటిపోయి మరీ అప్పులు చేస్తోంది. ఇంకా ఇంకా అప్పుల కోసం కేంద్రం వద్ద పడిగాపులు పడుతోంది.
Also Read: ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?
మూలధన వ్యయం అతి తక్కువ .. ఖర్చు అంతా వడ్డీలు, పథకాలకే !
ఓ వైపు రూ. 40వేల కోట్ల అదనపు ఆదాయం.. మరో వైపు రూ. 40వేల కోట్ల రుణాలు సేకరించి ఏపీ ప్రభుత్వం మూలధన వ్యయం కనీస మాత్రంగా చేయలేదు. వచ్చిన ఆదాయంలో సగానికిపైగా అంటే రూ. 50,419.15కోట్లు నగదు బదిలీ పథకాలు, సబ్సిడీ ఖాతలకు వినియోగించారు. మిగతా మొత్తం వడ్డీలు, జీతాలు, పెన్షన్లకు ఖర్చు చేశారు. బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సం మూలధన వ్యయం రూ. 30,571.53 కోట్లు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ చేసింది రూ. 2,912.39కోట్లు మాత్రమే. ఇది ఏపీ ఆర్థిక పరిస్థితిని మరింతగా దిగజారుతోంది.
Also Read: పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?
జీతాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం రోడ్డెక్కుతున్న ఉద్యోగులు !
ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి సజీవ సాక్ష్యంగా ఉద్యోగులు కనిపిస్తున్నారు. వారికి ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతున్నాయి. అంతే కాదు.. తమ జీపీఎఫ్ సొమ్మును కూడా ప్రభుత్వం అక్రమంగా వాడుకుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. తమ డబ్బులు తమకు ఇవ్వడానికి ఏమిటి ఇబ్బంది అని ప్రశ్నిస్తున్నారు. పే రివిజన్ కమి,న్ సిఫార్సులను ఆమోదించి..తమకు జీతాలు పెంచుతారని ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారంతా రోడ్డెక్కుతున్నారు. ఇంత దారుణమైన ఆర్థిక పరిస్థితిలో తాము మెత్తగా ఉంటే జీతాలు కూడా ఇస్తారో లేదో నన్న ఆందోళనతో ఉద్యోగులు ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాం కదా అన్న ఆర్థిక మంత్రి మాటలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
అదనపు అప్పులకు దొరకని అనుమతి !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూలధన వ్యయం నిబంధనలకు అనుగుణంగా చేయకపోవడంతో కేంద్రం అదనపు అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చిన రుణ పరిమతికి తగ్గట్లుగా లోన్లు తీసుకున్నారు. ఇంకా అదనపు అనుమతి కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి అదే పనిగా కేంద్రమంత్రులతో సమావేశం అయినా అనుమతి రాలేదు. తీసుకున్న రుణంలో క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఎక్కువగా ఉండాలి. అంటే అప్పుల్ని సంపద సృష్టించడానికి వాడుకోవాలి. మూడు నెలల కిందటే ఈ విషయంలో కేంద్రాన్ని సంతృప్తి పరిచిన రాష్ట్రం రూ. పదివేల కోట్ల అదనపు రుణాల్ని తెచ్చుకోగలిగింది. ఈ సారి మాత్రం సాధ్యం కాలేదు. అదనపు అప్పులు లభించకపోతే ఇక బ్యాంకులు, ఆర్థిక సంస్థల మీద ప్రభుత్వం ఆధారడాల్సి ఉంటుంది. అయితే ఇటీవల డిఫాల్ట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ జెన్‌కో డిపాల్టర్‌గా మారింది. తీసుకున్న రుణాలు చెల్లించడంలేదు. ఈ కారణంగా బ్యాంకులు కూడా వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. వచ్చే రెండు, మూడు నెలలు ఏపీ సర్కార్ ఆర్థఇక పరంగా మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.
బిల్లుల చెల్లింపులు పెండింగ్ - సరఫరాదారులు, కాంట్రాక్టర్ల రెడ్ సిగ్నల్ !
ఏపీ ప్రభుత్వం ఎవరికీ బిల్లులు కూడా చెల్లించడం లేదు. అభివృద్ధి పనులు ఎలాగూ సాగడం లేదు. కనీస అవసరాలకు సరఫరా చేస్తున్న వాటికీ బిల్లులు చెల్లించడం లేదు. నాలుగు రోజుల కిందట కర్ణాటక పాల సరఫరాదారులు లేఖ రాశారు. తర్వతా కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు లేఖ రాశారు. వీరికి వందల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. నిన్నటికి నిన్న మెడికల్ ఉపకరణాలను ఏపీకి సరఫరా చేయవద్దని ఐఎండీ ఇండస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఏపీ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేసింది. వంద శాతం డబ్బు చెల్లిస్తేనే పరికరాలు సరఫరా చేయాలని పరిశ్రమలకు సూచించింది.ఇక సివిల్ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం మానేసి చాలా కాలం అయింది. వారు టెండర్లు కూడా వేయడం లేదు. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఎవరూ పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. చివరికి ప్రభుత్వ శాఖలు కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. డిస్కంలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు కూడా ఇవ్వడంలేదు. డిస్కంలకు రెండున్నరేళ్లలో రూ. పాతిక వేల కోట్ల బకాయి పడ్డారని తక్షణం చెల్లించాలని ఏపీఈఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇలాంటి ఆర్థిక సమస్యలు ప్రభుత్వానికి కోకొల్లలుగా ఉన్నాయి.
Also Read: ప్రాజెక్టుల వివరాలు తక్షణం పంపండి.. రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ !
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.. ఎప్పుడనేది తేలాలి !
ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని.. ఎప్పుడనేదే తేలాల్సి ఉందని.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు అధికారులు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఇంటర్నల్‌గా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అందులో పరిస్థితులపై వాడి వేడి చర్చ జరిగింది. ఆర్థిక పరిస్థితి కుప్పకూలడం ఖాయమని.. ఎప్పుడనేదే తేలాల్సి ఉందని.. బయటపడటం అసాధ్యమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
Also Read : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సగం బలహీనవర్గాల నేతలకే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి