Goutham Reddy: 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమిలో ఏపీ కీలకం... కేంద్రం వాటా నిధులపై చర్చ... కేంద్రమంత్రి సోనోవాల్ తో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ
ఏపీలో పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణాలకు నిధులివ్వాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ని కోరారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించారు.
దిల్లీ పర్యటనలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం దిల్లీలో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆయన, అనంతరం కేంద్ర పోర్టులు, ఓడరేవులు, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ని కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లకు కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన నిధులపై చర్చించారు. ఏపీలో 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
#Ports are national assets and they hold strategic importance. Requested @shipmin_india @sarbanandsonwal to consider providing grant to upcoming non-major ports, speed up Environmental clearances & to assign some projected projects to AP, taking advantage of its long coastline. pic.twitter.com/jRsiYwwYpH
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) November 12, 2021
Also Read: యాసంగి వడ్లు కొంటరా ? కొనరా? తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు !
దేశాభివృద్ధిలో ఏపీ కీలకం
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి గౌతమ్ రెడ్డి. సీఎం జగన్ నాయకత్వంలో గత రెండున్నరేళ్ల కాలంలో ఏపీ మారిటైమ్ బోర్డును స్థాపించి, ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ కారిడార్ డెవలప్ మెంట్ చేసిన విధానాన్ని కేంద్రమంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమిలో ఏపీ కీలకం అవుతుందని చెప్పారు. 2030 నాటికి ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ఎగుమతులను 10 శాతం పెంచేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎగుమతులకు సంబంధించిన వాణిజ్య ఉత్సవం-2021ని విజయవంతంగా నిర్వహించామన్నారు.
కేంద్ర మంత్రి హామీ
ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు గౌతమ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో మేజర్ పోర్టులను గుర్తించి నివేదిక అందించాలని సోనోవాల్ కోరారు. మంత్రి మేకపాటి పర్యటనలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ రెసిడెన్స్ భవన్ కమిషనర్ భావనా సక్సేనా, మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు ఉన్నారు.
Also Read: ప్రాజెక్టుల వివరాలు తక్షణం పంపండి.. రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ !