Vizag CII summit Day: ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుతాం - విశాఖ 30వ భాగస్వామ్య సదస్సులో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు
Visakhapatnam: ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని.. ఏపీ యువతలో నైపుణ్యం పెంచి ఉద్యోగాలిస్తామని దిగ్గజ పారిశ్రామికవేత్తలు హామీ ఇచ్చారు. విశాఖ సీఐఐ సమ్మిట్ ఉత్సాహంగా ప్రారంభమయింది.

CII Partnership Summit: విశాఖలో ప్రారంభమైన రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న వివిధ ప్రముఖ సంస్థలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి... పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పాలసీల గురించి మాట్లాడారు. అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందన్నారు. భారత దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కరణ్ అదానీ అభిప్రాయపడ్డారు. దీనికి మార్గదర్శిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ఏపీలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో అదానీ సంస్థ పనిచేస్తోందని వివరించారు. ఏపీ వృద్ధిలో అదానీ సంస్థ కూడా భాగస్వామి అవుతోందని స్పష్టం చేశారు. నైపుణ్యం ఉన్న యువత, మానవ వనరులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఏపీని మంత్రి నారా లోకేష్ తీర్చిదిద్దుతున్నారని కరణ్ అదానీ కితాబిచ్చారు. ఇక జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లిఖార్జున రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు వస్తున్నాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని జీఎమ్మార్ అధినేత చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకో సిస్టంను ఆంధ్రప్రదేశ్‌లో సిద్ధం చేస్తున్నామని... మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ సెంటర్ కూడా భోగాపురం ఎయిర్ పోర్టులో వస్తుందని జీఎమ్మార్ సంస్థ అధినేత ప్రకటించారు.
ఈ సదస్సులో పాల్గొన్న భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకువెళ్తోందని... గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందని చెప్పారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రపంచానికి వాక్సిన్ అందించగలిగిన దేశంగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు జీనోమ్ వ్యాలీ లాంటి ఎకోసిస్టమ్‌ను తయారు చేశారని... అదే జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ కోవిడ్‌కు వ్యాక్సీన్ తయారు చేసి అందించిందని సుచిత్రా ఎల్లా వివరించారు.
బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రసంగిస్తూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి గ్రోత్ ఇంజిన్‌లా ముందుందని అన్నారు. వెయ్యి కిలోమీటర్ల తీరం కలిగిన ఏపీ... ట్రేడ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు గేట్ వే గా ఉంటోందన్నారు. యువతకు అండగా ఉండేలా రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లు... విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని సంజీవ్ బజాజ్ ప్రకటించారు. భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి ప్రసంగిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా యుగం నడుస్తోందని... ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కూడా ఈ రంగాల్లో ముందడుగు వేస్తోందని అన్నారు. ఏపీ వృద్ధిలో భారత్ ఫోర్జ్ కూడా భాగస్వామి అవుతోందని వెల్లడించారు. నౌకా నిర్మాణం, పర్యాటకం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ ఫోర్జ్ నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో ఏపీలో పనిచేస్తున్నామని... రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాలు కల్పించే అంశంలోనూ భారత్ ఫోర్జ్ సంస్థ భాగస్వామి అయ్యిందని అమిత్ కల్యాణి వివరించారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ... ఏపీ ప్రజలు, ముఖ్యమంత్రి చంద్రబాబు కలలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని... రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లులూ గ్రూప్ అత్యాధునిక మాల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని అలీ చెప్పారు.
Hon’ble Vice-President Shri C. P. Radhakrishnan graced the Inaugural Session of the 30th CII (Confederation of Indian Industry) Partnership Summit 2025 as the Chief Guest in Visakhapatnam, Andhra Pradesh, today.
— Vice-President of India (@VPIndia) November 14, 2025
The Hon’ble Vice-President highlighted India’s remarkable economic… pic.twitter.com/tHOXE9nHH2
సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో చర్చించారు. AI డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని రిలయన్్ ప్రకటించారు. 1 GW ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయెన్స్..ప్రపంచంలో అత్యంత అధునాతనమైన GPUలు, TPUలు, AI ప్రాసెసర్‌లను హోస్ట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న AI డేటా సెంటర్ కోసం 6 GWp సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యంతో నిర్మించనుంది.





















