Ind vs SA 1st test score: బుమ్రా పేస్‌కు దక్షిణాఫ్రికా విలవిల.. మెరిసిన కుల్దీప్, సిరాజ్.. తక్కువ స్కోరుకు సఫారీలు ఆలౌట్
India vs South Africa 1st test score: దక్షిణాఫ్రికా జట్టుపై తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. దాంతో సఫారీలు తొలి ఇన్నింగ్సులో 159 పరుగులకే ఆలౌట్ అయింది.

Ind vs SA 1st test Score Updates | కోల్‌కతా: టీమిండియాతో మొదలైన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు తరఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన అత్యల్ప స్కోరు ఇదే. ఇంతకు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 222 పరుగులు కాగా.. నేడు మరీ తక్కువ స్కోరుకే సఫారీలను బుమ్రా, కుల్దీప్, సిరాజ్ చుట్టేశారు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టారు. స్వదేశంలో భారత బౌలర్లు ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించారు.
ఐడెన్ మార్‌క్రమ్, రియాన్ రికెల్టన్ 57 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వికెట్ల పతనం ప్రారంభమైంది. మార్‌క్రమ్ 31 పరుగులకు, రికెల్టన్ 23 పరుగులు చేసి ఔటయ్యారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యారు. టోనీ డి జోర్జీ 55 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
Innings Break!
— BCCI (@BCCI) November 14, 2025
5⃣-fer for Jasprit Bumrah 🫡
2⃣ wickets each for Mohd. Siraj and Kuldeep Yadav 👏
1⃣ wicket for Axar Patel 👌
A magnificent bowling effort!
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/Hkrb5nzbeZ
ఈడెన్ గార్డెన్స్‌లో అత్యల్ప స్కోరు
ఓ విదేశీ జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో చేసిన మూడవ అత్యల్ప స్కోరు ఇది. ఇక్కడ విదేశీ జట్టు చేసిన అత్యల్ప తొలి ఇన్నింగ్స్ స్కోరు బంగ్లాదేశ్ పేరిట నమోదైంది. బంగ్లాదేశ్ 2019లో కేవలం 106 పరుగులకు ఆలౌట్ అయింది. రెండవ అత్యల్ప స్కోరు వెస్టిండీస్ పేరిట ఉంది విండీస్ జట్టు 2011లో 153 పరుగులకు ఆలౌట్ అయింది. తాజాగా చేసిన 159 పరుగుల స్కోరుతో ఈ జాబితాలో మూడవ స్థానానికి దక్షిణాఫ్రికా చేరుకుంది.
జస్ప్రీత్ బుమ్రా పంజా
ఈడెన్ గార్డెన్ టెస్ట్ ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 14 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సఫారీల నడ్డి విరిచాడు. బుమ్రా కెరీర్‌లో ఇది 16వ 5 వికెట్ల హాల్. ఇన్నింగ్స్ లో బుమ్రా 5 మెయిడెన్ ఓవర్లు చేశాడు. ఇషాంత్ శర్మ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజున 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే. 2019లో ఇదే స్టేడియంలో ఇషాంత్ శర్మ ఈ ఘనతను సాధించాడు. కుల్దీప్ యాదవ్, పేసర్ మహమ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.
కెప్టెన్‌గా స్వదేశంలో గిల్ కు తొలి టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ నెగ్గి స్వదేశంలో విజయాలతో మొదలుపెట్టాలని గిల్ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే బౌలర్లు తక్కువస్కోరుకు సఫారీల ఆట కట్టించారు. దాంతో భారత బ్యాటర్లు ఎంత ఎక్కువ స్కోరు సాధిస్తారా అనేది ఫాలో ఆన్ ఆధారపడి ఉంటుంది.





















