యాసంగి ధాన్యం అమ్మకానికి తెలంగాణలో సరికొత్త విధానం
గ్లోబల్ టెండర్ ప్రక్రియ ద్వారా యాసంగిలో తడిసి ధాన్యాన్ని అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో మరో రెండు నెలల్లో వర్షకాలం పంట చేతికి రానుంది. ఇప్పటికే యాసంగిలో తడిసిన ధాన్యం గొడౌన్లలో నిల్వ ఉంది. ఇవి క్లియర్ చేయకుంటే రేపు వచ్చే పంట కొనుగోలుపై ప్రభావం పడనుంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే మాత్రం రాష్ట్రంలోనే తొలిసారి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చినట్టు అవుతుంది.
గ్లోబల్ టెండర్ ద్వారా యాసంగి ధాన్యాన్ని అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనిపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అలా ప్రకటన వచ్చిందో లేదో అధికారులు ఆగమేఘాల మీద ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై పౌరసరఫరాల, గిడ్డంగుల మంత్రి గంగుల కమలాకర్ సంతకం కూడా అయింది.
అన్ని దశల్లో ప్రక్రియ పూర్తైన ఈ ఫైల్ ఇప్పుడు కేసీఆర్ టేబుల్‌పైకి చేరనుంది. ఒకట్రెండు రోజుల్లో ఆయన వద్దకు ఈ ఫైల్ వెళ్లిన తర్వాత ఆయన ఆమోదం లభించిన వెంటనే టెండర్ ప్రక్రియ మొదలు కానుంది. మొదట విడతగా 25 లక్షల టన్నులను అమ్మడానికి సిద్ధమైంది ప్రభుత్వం. దీనికి త్వరలోనే సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నారు అధికారులు.
ఇలా గ్లోబల్ టెండర్ ద్వారా ధాన్యం విక్రయించడం తెలంగాణలో మొదటిసారి కానుంది. ఇప్పటికే ఈ విధానం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఇలా గ్లోబల్ టెండర్ విధానంలోనే మూడేళ్ల నుంచి అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే విధానం అనుసరించనున్నారు.