Minister Kakani on E Crop: రైతులకు మంత్రి కాకాణి గుడ్‌న్యూస్ - ఈ క్రాప్ నమోదు చేసుకోండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు
AP Farmers To Register For E crop: ఉచిత పంటల బీమా కోసం రైతు ఒక్క రూపాయి కూడా రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
![Minister Kakani on E Crop: రైతులకు మంత్రి కాకాణి గుడ్‌న్యూస్ - ఈ క్రాప్ నమోదు చేసుకోండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు Register For E crop, Not a single rupee will cost: says AP Minister Kakani Govardhan Reddy DNN Minister Kakani on E Crop: రైతులకు మంత్రి కాకాణి గుడ్‌న్యూస్ - ఈ క్రాప్ నమోదు చేసుకోండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/15/cdb69407997bb38bbfce4229d2f7a9af_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉచిత పంటల బీమా కోసం రైతు ఒక్క రూపాయి కూడా రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ తో కలసి ఆయన పాల్గొన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చేలోగా ఏదైనా ప్రకృతి విపత్తుతో నష్టపోతే రైతులపై ఆర్థికభారం పడుతుందని చెప్పారు మంత్రి కాకాణి. ఈ ఆర్థిక భారాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు, రైతులకు అండగా ఉండేందుకు డాక్టర్ వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పారు.
పంట బీమా సులభం..
గతంలో పంటలకు బీమా చేయించుకోవడం కష్టతరంగా ఉండేదని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి నష్టపోయేవారని, ప్రస్తుతం అలాంటి కష్టాలు లేవన్నారు మంత్రి కాకాణి. ఈ–క్రాప్ నమోదు చేయించుకుంటే చాలు పంట నష్టపరిహారం అందించే విధంగా సీఎం జగన్ ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే బీమా రక్షణ కల్పిస్తూ పరిహారం అందిస్తున్నామన్నారు కాకాణి. గత ప్రభుత్వం హయాంలో ఉన్న బకాయిలు చెల్లిస్తూ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక్క విడతలోనే రూ. 2,977.82 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఉచిత పంటల బీమా పథకం కింద అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం సొమ్ముని జమ చేస్తున్నామన్నారు.
వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ పథకాలు..
ఇప్పటికే వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద రూ.23,875 కోట్లు ఇచ్చామని, సున్నా వడ్డీకి సంబంధించి పంట రుణాలు ఇస్తున్నామని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు తోడుగా నిలుస్తున్నామని చెప్పారు మంత్రి కాకాణి. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేసి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, రైతుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్ బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, కౌలు రైతులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన రుణాలు అందించాలని కోరారని చెప్పారు.
వైఎస్‌ఆర్ యంత్రసేవా పథకం కింద ఇటీవల ఒకే విడతలో 4 వేల ట్రాక్టర్లతో పాటు 320 వరి కోత యంత్రాలకోసం 40 శాతం సబ్సిడీపై నిధులు విడుదల చేశామని చెప్పారు మంత్రి కాకాణి. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక ప్రతిపక్షం పస లేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించిన వ్యక్తిగా సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా, రైతులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్ కు ప్రజల ఆశీస్సులు అందించాలని చెప్పారు కాకాణి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)