Weather Updates: వేగంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు - నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించింది.
Southwest Monsoon : ఏపీలోని రాయలసీమలో పూర్తి స్థాయిలో విస్తరించిన రుతుపవనాలు తెలంగాణలోనూ వేగంగా వ్యాపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో సోమవారం ప్రవేశించిన రుతుపవనాలు రాష్ట్రం మొత్తం వ్యాపిస్తున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించింది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి., మొత్తం ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
నైరుతి రుతుపవనాల ఆగమనంతో మొదలైన వర్షాలతో నిన్న ఉపశమనం కలిగింది. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. కోస్తాంధ్ర జిల్లాల్లోకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు జిల్లా మీదుగా విస్తరిస్తోంది. మరో నాలుగు గంటల్లో విజయవాడ జిల్లాతో పాటుగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అర్ధరాత్రి సమయం నుంచి విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
Synoptic features of weather inference and warnings for Andhra Pradesh in Telugu language Dated 14.06.2022. pic.twitter.com/AkC6hShgwb
— MC Amaravati (@AmaravatiMc) June 14, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పల్నాడు జిల్లా నర్సారావుపేట - చిలకలూరిపేట పరిధిలో భారీ వర్షాలు విస్తారంగా కురుస్తున్నయి. బాపట్ల జిల్లాలో, ప్రకాశం జిల్లా గిద్దలూరు వైపు వర్షాలు కురిశాయి. విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం నగరంలో రుతుపవనాల మొదటి వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో కురుస్తున్న వర్షాలు తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లోకి విస్తరించనుంది. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం జిల్లాల్లొ విస్తారంగా వర్షాలు కురిశాయి.
తెలంగాణలో వర్షాలు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. గత ఏడాది జూన్ తొలి వారంలో వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది రెండో వారం తరువాత తెలంగాణలో ప్రవేశించాయి. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.