డేంజర్ జోన్‌లో మున్నేరు వాగు, మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం
ఖమ్మంలోని మున్నేరు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరివాహక ప్రాంతం డేంజర్ జోన్‌లో ఉంది. ఇప్పటికే నీటి మట్టం 16 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మళ్లీ వరదలు ముంచెత్తే ప్రమాదముంది. ప్రస్తుతానికి వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల రోడ్లు బ్లాక్ చేశారు. నీటి మట్టం 24 అడుగులకు చేరుకుంటే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే...ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరులో నీటి ప్రవాహం ఉద్ధృతమవుతోంది. మరోసారి విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉండడం వల్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి బాధితులను పరామర్శించనున్నారు. అంతకు ముందు రాష్ట్ర డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వరద ప్రవాహం పెరిగినా ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.