Charminar Funday: సరికొత్త కార్యక్రమంతో సందడిగా మారిన చార్మినార్ పరిసరాలు
పాతబస్తీలోని చార్మినార్ వద్ద ‘ఏక్ శామ్ చార్మినార్ కె నామ్’ కార్యక్రమం సందడిగా సాగింది. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ‘సండే ఫన్ డే’ కార్యక్రమం మాదిరిగా చార్మినార్ వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ప్రతి ఆదివారం చార్మినార్ వద్ద ‘ఏక్ శామ్ చార్మినార్ కె నామ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చార్మినార్ అందాలతో పాటు వివిధ రకాల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మువ్వన్నెల విద్యుత్ కాంతులతో చార్మినార్ మెరిసిపోతోంది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.






















