Mumbai Indians Out of Playoffs Race | ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్ | ABP Desam
ఐదు సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్లతో విజయం సాధించడంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో చెరో 16 పాయింట్లతో కోల్‌కతా, రాజస్తాన్ టాప్-2 స్థానాల్లో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలో 12 పాయింట్లతో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. మే 14వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 14 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ అనుకోని కారణాల వల్ల మ్యాచ్ రద్దయినా రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు ఆ రెండు టీమ్స్ పదమూడేసి పాయంట్లతో ఉంటాయి. ముంబై మిగతా మ్యాచ్‌లు అన్నీ గెలిచినా 12 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. కాబట్టి ఇక ముంబైకి ఛాన్స్ లేనట్లే. ఈ సీజన్‌లో ముంబై ప్రదర్శన కూడా ఆశాజనకంగా లేదు. ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. జస్‌ప్రీత్ బుమ్రా బంతితో రాణించినా... బ్యాటింగ్ వైఫల్యం ముంబైని దెబ్బ తీసింది. హార్దిక్ పాండ్యా లీడర్ షిప్‌పై కూడా విమర్శలు వచ్చాయి. తర్వాతి మ్యాచ్‌ల్లో కంటితుడుపు విజయాలు అయినా సాధిస్తే ఈ విమర్శలు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎలాగో ఒత్తిడి కూడా ఉండదు కాబట్టి ముంబై ఇకపై స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌ల్లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.