MI vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ | ABP Desam
ఆరు పాయింట్ల కోసం పోరాటంలో ముంబై, సన్ రైజర్స్ నువ్వా నేనా అని తలపడతాయి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా భావించే ఉంటారు. వాంఖడేలో సన్ రైజర్స్ ని వాయించి వదిలిపెట్టింది ముంబై ఇండియన్స్. ముందు బౌలింగ్ తో తడాఖా చూపించి తర్వాత బ్యాటింగ్ లోనూ దుమ్ము రేపిన పాండ్యా కాటేరమ్మ కొడుకులపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ఆరెంజ్ ఆర్మీ ఆరంభం ఓకే
టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంటే..బ్యాటింగ్ కోసం బరిలోకి దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ, ట్రావియెస్ భారీ హిట్స్ కి వెళ్లకపోయినా వికెట్లు పడకుండా బాగానే ఆడారు. ప్రధానంగా అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి పిచ్ కండీషన్ కి తగినట్లుగా ఆడుతున్న టైమ్ లో బిగ్ బ్లో. పాండ్యా బౌలింగ్ లో అభిషేక్ అవుటవటంతో సన్ రైజర్స్ వికెట్ల పతనం మొదలైంది. అప్పటికే ఓపెనింగ్ వికెట్ కు 59 పరుగులు పెట్టినా...ఆ తర్వాత టాప్ ఆర్డర్ అంతగా ఆదుకోలేకపోయింది. ప్రధానంగా హెడ్ ఇబ్బంది పడ్డాడు. 29 బాల్స్ ఆడి 28 పరుగులే చేశాడు. చాలా రేర్ గా ఆడతాడు హెడ్ ఇలా.
2. టాప్ లేపిన విల్ జాక్స్
ఊహించని రీతిలో ముంబై విల్ జాక్స్ ఆయుధాన్ని బలంగా వాడింది. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన విల్ జాక్స్ ముందు ఇషాన్ కిషన్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత పెద్దగా ఆడకున్నా క్రీజులోనే పాతుకున్న హెడ్ ను అవుట్ చేసిన విల్ జాక్స్ 82 పరుగులకే సన్ రైజర్స్ 3 వికెట్లు కోల్పోయేలా చేశాడు. జాక్స్ 3 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి హెడ్, ఇషాన్ కిషన్ లను అవుట్ చేసి మ్యాచ్ ను ముంబైవైపు తిప్పాడు.
3. పర్వాలేదనిపించిన ఫినిషింగ్
నితీశ్ రెడ్డిని బౌల్ట్ అవుట్ చేయటంతో సన్ రైజర్స్ రన్ రేట్ భారీగా పడిపోయింది. కానీ చివర్లో క్లాసెన్, అనికేత్ వర్మ కాస్త హిట్టింగ్ చేయటంతో ఊహించిన దానికంటే ఓ ఇరవై పరుగులు ఎక్కువే కొట్టింది సన్ రైజర్స్. క్లాసెన్ 37 పరుగులు చేసి ఊపు చూపిస్తున్న టైమ్ లో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అనికేత్ చివర్లో 2 సిక్సర్ల సాయంతో 18పరుగులు, కెప్టెన్ కమిన్స్ ఓ సిక్స్ కొట్టడంతో ముంబైకి కనీసం 163పరుగులైనా టార్గెట్ పెట్టగలిగింది సన్ రైజర్స్.
4. సమష్ఠిగా రాణించిన ముంబై టాప్ ఆర్డర్
ఎవరూ బీభత్సంగా ఆడేయలేదు అలా అని ఎవరూ లైట్ కూడా తీసుకోలేదు. 163 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసే క్రమంలో ముంబై టాప్ ఆర్డర్ అంతా బాధ్యతగానే ఆడింది. ప్రధానంగా రోహిత్ శర్మ 3 సిక్సర్లతో తన వింటేజ్ స్టైల్ చూపించి 26పరుగులు చేస్తే...రికెల్టన్ జీవదానాలతో 31 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో అదరగొట్టిన విల్ జాక్స్ బ్యాటింగ్ లోనూ తన జోరు చూపించాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 26 పరుగులు చేయటంతో లక్ష్యం దిశగా సులభంగానే చేరుకుంది ముంబై ఇండియన్స్.
5. చివర్లో కాసేపు డ్రామా
హర్షల్ పటేల్ వేసిన 17 ఓవర్ లో సిక్సు ఫోర్ బాదిన పాండ్యా టార్గెట్ ను మరింత ఈజీ చేసేస్తే...విజయానికి ఇక రెండు పరుగులు మాత్రమే కావాలనగా ఈషన్ మలింగ బౌలింగ్ లో కాసేపు డ్రామా నడిచింది. తన ఓవర్లో మలింగ పాండ్యాను, నమన్ ధీర్ ను ఔట్ చేయటంతో విజయం కాసేపు ఆలస్యమైనా మిగిలిన పనిని తిలక్ వర్మ పూర్తి చేసేసి ముంబై ఇండియన్స్ కి నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరు పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో ఏడో స్థానంలోనే కొనసాగుతుండగా...సీజన్ లో ఐదో పరాజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ పదో స్థానంలో ఉన్న చెన్నైకి నేను తోడున్నా మావా అంటూ 9వ స్థానంలోనే తిష్ట వేసుకుని కూర్చుంది.





















