Ind vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABP
ఆంగ్లేయుల పొగరును అణిచివేశాం. స్వత్రంత్య ఉద్యమంలోనే కాదు నిన్న రాత్రి జరిగిన వరల్డ్ కప్ సైమీ ఫైనల్లో కూడా. వర్షం కారణంగా భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో గెలుపు ఉషోదయం మనదే. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ 2 లో మన జట్టు 68పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. గయానాలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. మన ఓపెనర్, కెప్టెన్ సాబ్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మీద చూపించిన జోరును ఇంగ్లండ్ మీద కొనసాగించాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో రెచ్చిపోయాడు. కొహ్లీ ఫామ్ లేమిని కొనసాగిస్తూ మరోసారి 9 పరుగులకే అవుటైనా, పంత్ 4పరుగులకే పెవిలియన్ చేరినా....మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తోడుగా హిట్ మ్యాన్ రెచ్చిపోయాడు. 39 బంతుల్లో 6ఫోర్లు 2 సిక్సర్లతో 57పరుగులు బాదిన రోహిత్ శర్మ భారత్ ను నిలబెట్టడమే కాదు గౌరవప్రదమైన స్కోరు సాధించటంతో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ కు తోడుగా సూర్య కూడా 36 బంతుల్లో 4ఫోర్లు 2 సిక్సర్లతో 47పరుగులు చేసి అవుటై జస్ట్ లో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. చివర్లో పాండ్యా, జడేజా, అక్షర్ తలో చేయి వేయటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 171పరుగులు చేసింది. 172 టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జోరు చూపించింది మొదటి మూడు ఓవర్లే. ఎప్పుడైతే అక్షర్ పటేల్ ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి ఇంగ్లండ్ సీన్ మారిపోయింది. అక్షర్ పటేల్ వేసిన మొదటి మూడు ఓవర్లలో ప్రతీ ఓవర్ మొదటి బంతికి ఓ వికెట్ తీశాడు. బట్లర్ ను అవుట్ చేయటంతో అక్షర్ ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలుపెడితే...మరో వైపు కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా కూడా ఇంగ్లండ్ ను చెడుగుడు ఆడేసుకున్నారు. ఫిల్ సాల్ట్, మొయిన్ అలీ, బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, శామ్ కర్రన్ ఉండటానికి చాంతాడంత లిస్టు బ్యాటర్లు ఉన్నా ఒక్కరూ ఇంగ్లండ్ ను ఆదుకునే ప్రయత్నం చేయలేకపోయారు. 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కనీసం వంద కూడా దాటేది కాదు. చివర్లో జోఫ్రా ఆర్చర్ కాస్త బ్యాట్ ఝుళిపించటంతో ఇంగ్లండ్ 103పరుగులకే ఆలౌట్ అయ్యి వరల్డ్ సెమీఫైనల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 68పరుగులతో ఘన విజయం సాధించిన భారత్...శనివారం జరగబోయే ఫైనల్లో ప్రపంచకప్పు కోసం సౌతాఫ్రికా తో తలపడనుంది.