National Resistance Force: అఫ్గాన్ లో ఆట ఇప్పుడే మొదలైంది.. 'పంజ్‌షీర్'తో అంత ఈజీ కాదు!
అసలు పంజ్ షీర్ లో ఏం జరుగుతోంది? ఓవైపు పంజ్ షీర్ ను హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు అంటున్నారు. మరోవైపు తాలిబన్ల అంతు చూస్తామని పంజ్ షీర్ కా షేర్ అహ్మద్ మసూద్ గర్జిస్తున్నారు. నిజానికి పంజ్ షీర్ లో పైచేయి ఎవరిది? పంజ్‌షీర్ లోయ.. అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే కాబూల్ సహా దేశాన్నంతా చేతిలోకి తీసుకున్న తాలిబన్లకు ఇక్కడ మాత్రం వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల మంది తాలిబన్ వ్యతిరేక ఫైటర్లు ఉన్నారు.
ఈ లోయ ప్రస్తుతం నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ చేతిలో ఉంది. దీని నాయకుడే అహ్మద్ మసూద్. తాలిబన్లు చాలా కర్కశంగా ఉంటారు. ఏదైనా అనుకుంటే సాధించేవరకు నిద్రపోరు. అలాంటి తాలిబన్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు మసూద్. నిజానికి మసూద్ పేరు వింటేనే తాలిబన్లకు హడల్. అందుకే పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులను కోల్పోయినా సరే.. వెనకడుగు వేయడం లేదు మసూద్. సింహంలా గర్జిస్తున్నాడు. యావత్ అఫ్గాన్ పౌరులను తాలిబన్లపై పోరుకు సిద్ధం చేస్తున్నాడు.
తాలిబన్లపై తిరగబడండి.. తిరుగుబాటు బావుటా ఎగరేయండి అంటూ అఫ్గాన్ పౌరుల్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తున్నాడు మసూద్. ఎప్పటికీ తాలిబన్ల పాలన అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాడు. పంజ్ షీర్‌పై దాడిలో పాక్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నాడు. ముష్కరులతో కలిసి కుట్రలు చేస్తున్నా..ధైర్యం కోల్పోవద్దు..చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడుదాం..చావో రేవో తేల్చుకుందాం..పోరాటానికి సిద్ధం కండి అంటూ పిలుపునిచ్చాడు.
మసూద్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను తమకి సాయం చేయాలని కోరుతున్నాడు. రాక్షస తాలిబన్లపైన తుదివరకు పోరాటం చేస్తామని తేల్చిచెబుతున్నాడు. మరి ప్రపంచ దేశాలు మాకెందుకులే అనుకుంటాయో? పంజ్ షీర్ కు సాయం చేస్తాయో? చూడాలి.