Tsunami Warning in Alaska | అలస్కాకు సునామీ హెచ్చరిక జారీ
అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదయింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం వల్ల ఇప్పటికి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. కానీ ముందు జాగ్రత్తగా ప్రజలని ఎత్తైన సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు.
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, స్యాండ్ పాయింట్ సిటీకి 87 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలుస్తుంది. భారీ భూకంపం నేపథ్యంలో దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్‌సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో 130 కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి.




















