మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్
తాలిబన్లు మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధిస్తారో తెలిసిందే. కానీ...ఈ మధ్య ఈ ఆంక్షలు మరీ అతి అయిపోతున్నాయి. మహిళల డ్రెసింగ్‌పై రకరకాల కండీషన్‌లు పెట్టిన తాలిబన్లు..ఇప్పుడు వాళ్లు కనీసం మాట్లాడుకోడానికీ వీల్లేకుండా చేస్తున్నారు. మహిళలు ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు వినడాన్ని నిషేధించారు. ఇకపై...ఎవరూ ఎవరి మాటలూ వినకూడదని తేల్చి చెప్పారు. ప్రార్థించే సమయంలోనూ పక్క నుంచి ఎవరైనా వెళ్తే వెంటనే సైలెంట్ అయిపోవాలని కండీషన్ పెట్టారు. పైగా దీనికో ఫిలాసఫీ కూడా చెబుతున్నారు తాలిబన్లు. మహిళల వాయిస్‌ని ఆవ్రా అంటారని, అంటే..పెద్దగా వినబడకుండా సైలెంట్‌గా ఉండాలని అర్థమని అంటున్నారు. పాటలు పాడడానికీ వీల్లేదని ఆంక్షలు విధించారు.
ఈ నిబంధనలు పాటించడానికి దేవుడే వీళ్లందరికీ మనసు ఇస్తాడని చెబుతున్నారు తాలిబన్లు. ఈ నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే అంతర్జాతీయంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. తాలిబన్లు రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నారని మండి పడుతున్నాయి. మహిళలపై ఆంక్షలకు హద్దులంటూ లేకుండా ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి చాలా సందర్భాల్లో అఫ్గనిస్థాన్‌లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది.