Nellore Collector : నెల్లూరు జిల్లా కలెక్టర్ ను అడ్డుకున్న జ్యోతినగర్ వాసులు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని జ్యోతినగర్ వాసులు అడ్డుకున్నారు. వారం రోజుల క్రితం జ్యోతి నగర్ కి చెందిన 12మంది ఆటోలో వెళ్తూ సంగం బీరాపేరు వాగు వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒక బాలిక మృతి చెందింది. ఐదుగురు వాగులో గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో వారిలో ముగ్గురి శవాలు దొరికాయి. ఇంకా ఇద్దరికోసం గాలింపు జరుగుతోంది. ఈ క్రమంలో తమకు నష్టపరిహారం ఇంకా అందలేదంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆత్మకూరుకి రావడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ బీమాసొమ్ముతోపాటు, అదనంగా పరిహారం అందించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు కలెక్టర్. కలెక్టర్ హామీతో వారు శాంతించారు. ఆయన కారుకి అడ్డు తొలిగారు.





















