బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?
అయోధ్య రామ నిర్మాణం. ఆర్టికల్ 370 రద్దు. ఈ రెండూ బీజేపీ అజెండాలో చాలా కీలకమైనవి. ఎన్నో ఏళ్ల వివాదాలను పరిష్కరించి ఈ రెండింటికీ లైన్ క్లియర్ చేసింది ఆ పార్టీ. అయోధ్య రాముల వారి ఆలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేసింది. బీజేపీ రాజకీయంగా బలపడడానికి ఇదొక్కటి చాలు అని అంతా తేల్చి చెప్పారు. కానీ...కేవలం నాలుగు నెలల్లోనే అంతా తారుమారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోడానికి చాలా సమయమే పట్టింది ఆ పార్టీకి. బీజేపీకి కంచుకోటగా మారిపోయిన యూపీలో...అందులోనూ అయోధ్యలో ఆ పార్టీ ఓడిపోవడం ఏంటి..? అన్న డిబేట్ మొదలైంది. ఇప్పుడిప్పుడే దీని గురించి మర్చిపోతుండగా...ఇప్పుడు మరో దెబ్బ తగిలింది.ఆర్టికల్ 370 రద్దు తరవాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి జమ్ముకశ్మీర్‌లో. అక్కడ ఉగ్రవాదం అనేదే లేకుండా చేశామని, కొత్త కశ్మీర్‌ని పరిచయం చేశామని బీజేపీ చాలా ధీమాగా ప్రచారం చేసుకుంది. కచ్చితంగా బీజేపీదే అధికారం అనుకున్నారంతా. కానీ..సీన్ రివర్స్ అయింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకే కశ్మీర్ ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు తేల్చి చెప్పాయి.