Lady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?
సుప్రీంకోర్టు జడ్జిల లైబ్రరీలో ఓ కొత్త లేడీ జస్టిస్ విగ్రహం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇంతకుముందు వరకూ కళ్లకు గంతలు, చేతిలో కత్తితో ఉన్న విగ్రహం స్థానంలో కత్తికి బదులుగా భారత రాజ్యాంగం, తెరిచిన కళ్ళతో ఆ విగ్రహం ఉంది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ ఆదేశాల ప్రకారం జరిగిన ఈ మార్పు, ఇప్పుడు దేశంలో చట్టం గుడ్డిది కాదని.. కేవలం శిక్షకు ప్రతీక కాదని సూచిస్తుంది. అయితే, ఈ విగ్రహాన్ని కేవలం సీజేఐ ఆదేశాల ప్రకారం లైబ్రరీలో మాత్రమే పెట్టారు. మిగతా చోట్ల సంప్రదాయ విగ్రహమే ఉండనుంది.
సాంప్రదాయకంగా ఉన్న న్యాయదేవత విగ్రహంలో కళ్లకు గంతలు సమానత్వాన్ని సూచించింది. అంటే వ్యక్తుల హోదాతో తేడా లేకుండా ఎవరైనా న్యాయం ముందు ఒకటే అర్థాన్ని సూచిస్తుంది. న్యాయదేవత చేతిలోని కత్తి అన్యాయాన్ని శిక్షించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అయితే, ఈ కొత్త న్యాయదేవత విగ్రహం సీజేఐ చెప్పినందుకే ఏర్పాటు చేశారని.. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండవని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి తీర్పునూ ఇవ్వలేదని జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.