Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Telangana News: డిసెంబర్ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతి లోపు వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు.

Minister Ponguleti Srinivas Reddy Comments On Expansion Of Telangana Cabinet: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. గురువారం మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2.32 లక్షల ఇళ్ల దరఖాస్తులకు సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రజాపాలనలో అప్లై చేయని వారు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంక్రాంతి లోపు వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆర్‌వోఆర్ చట్టంపై సూచనలివ్వాలని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం చెప్పలేక ఆయన అసెంబ్లీకి రాలేదన్నారు. గత ప్రభుత్వ తప్పులే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణమని విమర్శించారు.
'రైతులకు బేడీలు సరికాదు'
'ధర్నా చౌక్‌ను ఓపెన్ చేశాం. ఎవరినీ మేము అడ్డుకోం. రైతులకు బేడీలు వేయడం సరైంది కాదు. ఇప్పటికే మా ముఖ్యమంత్రి ఈ ఘటనపై స్పందించారు. అదానీ విషయంలో వివాదం వద్దనే స్కిల్ యూనివర్శిటీకి ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కు పంపాం. రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ హాస్టళ్లకు డిసెంబర్ 31లోపు విడుదల చేస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడలేదు. తెలంగాణ తల్లి బయ్యారం ఉక్కు కర్మాగారం అంటూ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటున్నారు.' అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

