Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Andhra News: ఆసియా అభివృద్ధి బ్యాంక్ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ చెప్పింది. రూ.15 వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది.
Asian Development Bank Loan Clearence To Amaravati: రాజధాని అమరావతికి (Amaravati) ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank) గుడ్ న్యూస్ అందించింది. రూ.15 వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి రూ.20,500 కోట్ల సీఆర్డీఏ ద్వారా పరిపాలనా ఆమోదం తీసుకున్నట్లు కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఇప్పటివరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి రూ. 31 వేల కోట్లు టైఅప్ చేశామన్నారు. అటు, అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ మేరకు గురువారం లాటరీ తీసి ప్లాట్లు అప్పగించనున్నారు. 2014 - 19లో 14 గ్రామాల రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఆన్ లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్లాట్లు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. 14 గ్రామాల ప్రజలు ఈ లాటరికీ హాజరుకావాలని సీఆర్డీఏ పిలుపునిచ్చారు.
'నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ'
అమరావతి అనేది ప్రజా రాజధాని.. అలాగే యువతకు ఉపాధి కల్పించే రాజధాని అని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే విశాఖ, తిరుపతి, అమరావతి నగరాలపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. 'ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఒక కుటుంబం ఒక ఎంట్రప్రెన్యూర్ అనేది అమలుకావాలి. పలు నాలెడ్జీ ఎకానమీ యూనివర్శిటీలు ఇక్కడకు వస్తున్నాయి. ప్రపంచంలోని టాప్ 10 విశ్వ విద్యాలయాలు, టాప్ 10 ఆసుపత్రులు ఇక్కడకు రానున్నాయి.' అని పేర్కొన్నారు.
ఆర్ 5 జోన్‌పై స్పష్టత
అమరావతిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లో చేర్చిన ఆర్ 5 జోన్‌పై కలెక్టర్ల సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పష్టత ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వారి సొంత జిల్లాల్లోనే ఇంటి స్థలాలు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు సహకరించాలని కోరారు. భూములను ఎంపిక చేసే సీఆర్టీఏ నిధులు సమకూరుస్తుందన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఈ నెల 19న ప్రపంచబ్యాంక్ బోర్డు కూడా అమరావతి రుణంపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అలాగే, జనవరి నాటికి రూ.31 వేల కోట్ల రుణం అమరావతి నిర్మాణానికి అందుబాటులోకి వస్తుందన్నారు.
జూన్‌లో సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత రాజధాని నిర్మాణంపై రోడ్ మ్యాప్ ఇచ్చారని.. గడిచిన 3 నెలల్లో ధ్వంసమైన పరిస్థితుల్ని గాడిన పెట్టగలిగామని అన్నారు. ధ్వంసమైన పరిస్థితి అక్కడి నుంచి మొదలు పెట్టి పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్నట్లు వివరించారు. రాజధాని పునర్నిర్మాణంపై ఇంజినీర్లు, ఐఐటీ చెన్నై, హైదరాబాద్ నిపుణులతో అధ్యయనం చేయించి ఓ రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని.. ఇప్పుడు కొత్త పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేయగలిగామన్నారు. హడ్కో కూడా మరో రూ.11 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని.. మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణం రాజధాని నిర్మాణాలకు అందుబాటులోకి వస్తుందన్నారు. కీలక నిర్మాణాలతో పాటు రైతులకు ఇచ్చే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లే అవుట్‌లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ నిధులతోనే పూర్తి చేస్తామన్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలను కేటాయించడంతో పాటు లేఅవుట్ అభివృద్ధి చేయడంపై రైతులు కోర్టును ఆశ్రయించారు.