Indian Illegal Immigrants Deportation | లక్షలు లక్షలు లాక్కున్నారు..హీనాతి హీనంగా చూశారు | ABP Desam
అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న అక్రమవలసదారుల వ్యథలు ఒక్కటి కాదు. అమెరికాకు తీసుకువెళ్తామని ఏజెంట్లు చెప్పిన మాటలకు మోసపోయిన వాళ్లు కొందరు..వీసాలు గడువు తీరినా ఇండియాకు వచ్చే మార్గం లేక అక్కడే బిక్కు బిక్కుమని బతుకుతున్న వాళ్లు కొందరు..మోస పోయిన వాళ్లు...అంతగా చదువు జ్ఞానం లేనివాళ్లు..చిన్న పిల్లలు...ఇలా ఒక్కరు కాదు వచ్చిన 104మందిలో ఒక్కళ్లది ఒక్కో కథ. పంజాబ్ కు చెందిన హర్వీందర్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా ఏజెంట్ కు 42లక్షల రూపాయలు కట్టాడట. వర్క్ వీసా ఇప్పిస్తానని ఏజెంట్ ఖతర్ కు పిలిపించుకుని అక్కడి నుంచి బ్రెజిల్, కొలంబియా, పనామా అంటూ తిప్పుతూ నరకయాతన చూపించాడట. ఆఖరకు మెక్సికో నౌక ఎక్కి బోర్డర్ పెట్రోల్ వాళ్లకు దొరికిపోయాడు. పంజాబ్ లోని దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్ పాల్ సింగ్ అనే వ్యక్తిది మరో కథ. 15 గంటల పాటు సముద్రప్రయాణం చేయించి అమెరికాలోకి పంపిస్తామని 45కిలోమీటర్ల పాటు మంచులో నిండిపోయిన పర్వతాల్లో నడిపించారట. మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తుండగా...అక్కడి అధికారులకు దొరికిపోతే 14రోజుల చీకటి గదిలో పడేసి చిత్రహింసలు పెట్టారట. ఇలా అనేక కారణాలతో అమెరికా లో అక్రమ వలసదారుల ముద్రలు పడి ఇలా టెర్రరిస్టుల్లా కాళ్లు చేతులకు గొలుసులు కట్టించుకుని తిరిగి తమ జన్మభూమిలో అడుగుపెట్టామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వారిలో చాలా మంది. అమెరికా సైన్యం ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





















